ఖమ్మం
ఖమ్మం: ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24 నుంచి బంద్ చేపట్టాలని ఖమ్మం జిల్లా జేఏసీ పిలుపునిచ్చింది. BRTU కార్యాలయంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్ సత్తార్ మియా అధ్యక్షతన సమావేశం జరిగింది. BRTU గౌరవ అధ్యక్షులు పగడాల నాగరాజు, AIRTWF-CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ మాట్లాడారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేల జీవనభృతి, ప్రత్యేక సంక్షేమ బోర్డు, అనువైన ప్రాంతాల్లో అడ్డాలు, రూ.10 లక్షల ఇన్సూరెన్స్, టి-యూ యాప్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాపిడో, ఓలా, ఉబర్ వల్ల కార్మికులు నష్టపోతున్నారని, 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. సమావేశంలో INTUC మోటార్ రంగం అధ్యక్షులు పాల్వంచ కృష్ణ, AIRTWF-CITU జిల్లా కార్యదర్శి ఉపేందర్, AITUC అధ్యక్షులు పేరబోయిన మోహన్రావు, TNTUC రవీందర్, TUCI శ్రీనివాస్, BRTU జిల్లా అధ్యక్షులు ఎం.డి. వై. పాషా, ఆటో యూనియన్ కార్యదర్శి జిల్లా శ్రీనివాస్, ధరావత్ రాందాస్, రావుల శ్రీనివాస్, మోరీమేకల అమరయ్య, రవీందర్ రెడ్డి, తోట నాగరాజు, ముల్లార్ తదితరులు పాల్గొన్నారు.