ఖమ్మం:
పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు చిన్నారులను ప్రేమ, ఆప్యాయతలతో దగ్గరకు తీసుకుని, వారికి అర్థమయ్యే రీతిలో నచ్చజెప్పి చదువుపై ఆసక్తి పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. హోంవర్క్, క్లాస్‌వర్క్ చేయలేదని పిల్లలపై కోపం, బెదిరింపులు ప్రదర్శిస్తే వారు భయాందోళనలకు గురై తీవ్ర నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తక్కువ వేతనాలకు పనిచేస్తారని కనీస విద్యార్హతలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చిన్నారులను ఎలా గైడ్ చేయాలో, వారి మానసిక పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చన్నారు. B.Ed. అర్హత కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తే విద్యా శాస్త్రంతో పాటు పిల్లల మానసిక స్థితిపై అవగాహన ఉంటుందని, ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.



