సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపర్చాలి: మాజీ శాసన సభ్యులు సండ్ర
సత్తుపల్లి/ ఖమ్మం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 పడకల నూతన ఆసుపత్రి భవనం, సుమారు 17 మంది వైద్యులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సేవలు అందకపోవడం బాధాకరమన్నారు. కొంతమంది వైద్యులు విధులకు ఆలస్యంగా హాజరవుతున్నారని, మరికొందరు ముందుగానే వెళ్లిపోతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. ఆసుపత్రిలో మంచినీటి సమస్య, మృతదేహాలకు సకాలంలో పోస్టుమార్టం నిర్వహించకపోవడం, కొన్ని ధ్రువపత్రాల కోసం డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఇటీవల రేజర్లకు చెందిన వ్యక్తికి పాము కాటు వేయగా, సుమారు రెండున్నర గంటలపాటు యాంటీ స్నేక్ వెనం అందలేదని, పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించాల్సి వచ్చిందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దని సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది మానవతా దృక్పథంతో విధులు నిర్వహించి రోగులకు అందుబాటులో ఉండాలని కోరారు.









