Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

మహిళలు ఆత్మవిశ్వాసం తో స్వశక్తిపై నిలబడాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాఖీ పండుగ వేళ ఆడబిడ్డకు అండగా జిల్లా కలెక్టర్ ———————————————————— జనగామ, ఆగష్టు 29,పున్నమి జిల్లా ప్రతినిధి : *స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్ అందజేత* *ఆత్మవిశ్వాసంతో స్వశక్తిపై నిలబడాలని మహిళకు కలెక్టర్ ప్రోత్సాహం* రాఖీ పండుగ వేళ ఓ ఆడబిడ్డ జీవితంలో ఆత్మవిశ్వాసం, ఆశలను నింపేలా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆదరణగా నిలిచి, స్వావలంబనకు చేయూత అందించారు. శుక్రవారం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, నీర్మాల గ్రామానికి చెందిన *మహమ్మద్ సుల్తానా బేగం* జీవన పరిస్థితులను తెలుసుకొని, ఆమె స్వయం ఉపాధి పొందేందుకు *కలెక్టర్* సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల తన ఛాంబర్‌లో కుట్టు మిషన్‌ను అందజేశారు. తన భర్త కుటుంబ బాధ్యతలను వదిలి వెళ్లిపోవడంతో నాలుగేళ్ల చిన్నారితో ఒంటరిగా జీవనం సాగిస్తున్న సుల్తానా బేగం, తనకు స్థిరమైన ఆదాయం లేదని, చిన్న పాపను పోషించేందుకు ఉపాధి కల్పించాలని *జిల్లా కలెక్టర్‌కు* వినతిపత్రం సమర్పించారు. ఆమె పరిస్థితిని సహృదయంతో పరిశీలించిన *కలెక్టర్*, స్వశక్తితో జీవనోపాధి సంపాదించే మార్గాన్ని చూపాలనే ఉద్దేశంతో వెంటనే కుట్టు మిషన్‌ను అందించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. ప్రతి మహిళ తనలోని సామర్థ్యాన్ని నమ్ముకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. కష్టపడే వారికి అవకాశాలు తప్పక లభిస్తాయని, ఈ కుట్టు మిషన్ సుల్తానా బేగం జీవితానికి కొత్త ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. కుట్టు పనిని ఉపాధిగా మలుచుకొని తన చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని, కుటుంబానికి అండగా నిలవడంతో పాటు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు. రాఖీ పండుగ సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అని పేర్కొంటూ, సమాజంలోని ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని *కలెక్టర్* పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. కుట్టు మిషన్ అందుకున్న *మహమ్మద్ సుల్తానా బేగం*, *జిల్లా కలెక్టర్‌కు* హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం తనకు కొత్త జీవితంపై ఆశను కల్పించిందని, కష్టపడి పని చేసి, తన కుమార్తెను మంచి చదువులు చదివించి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాఖీ పండుగను పురస్కరించుకొని అందించిన ఈ కుట్టు మిషన్ ఒక మహిళ జీవితంలో కొత్త ఆశలకు నాంది పలికింది. కష్టపడి స్వశక్తితో జీవనోపాధి సంపాదిస్తూ తన చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఆమె సంకల్పానికి ఇది బలమైన చేయూతగా నిలిచింది. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగితే ప్రతి మహిళ స్వావలంబన సాధించి, తన కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవగలదనే సందేశాన్ని ఈ సంఘటన చాటి చెప్పింది.

జనగాం

ఉద్యానవన పంటల సాగుతో లాభదాయక వ్యవసాయానికి ప్రోత్సహం: జిల్లా కలెక్టర్

ఉద్యానవన పంటల సాగుతో లాభదాయక వ్యవసాయానికి ప్రోత్సాహం:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ——————————————————————— జనగామ,ఆగష్టు 29, కూరగాయల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందాలి* ఘనపూర్ (స్టేషన్) మండలంలోని శివునిపల్లి గ్రామంలో రైతు పొలాన్ని సందర్శించిన కలెక్టర్* *పందిళ్ల విధానంలో దొండ, పొట్లకాయ, సొరకాయ సాగు పరిశీలన* *పిచ్చి మొక్కల నియంత్రణ, తెగుళ్లు, నీటి యాజమాన్యంపై సూచనలు* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ, ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకొని, రైతులు అధిక ఆదాయం పొందాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సూచించారు. శుక్రవారం, జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) మండలం, శివునిపల్లి గ్రామానికి చెందిన *రైతు పిట్టల రాజు* వ్యవసాయ క్షేత్రాన్ని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సందర్శించి, దొండ, సొరకాయ, పొట్లకాయ సాగును పరిశీలించారు. పందిళ్ల (Pandals) విధానంలో ఏర్పాటు చేసిన తోటను పర్యవేక్షించిన *కలెక్టర్*, తోట నిర్వహణ తీరు, పంట పెరుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. తోట ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని *రైతును* అభినందించిన *కలెక్టర్*, పంట మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి, కలుపు నియంత్రణ చేపట్టాలని సూచించారు. నీటి నిర్వహణ, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా రైతును పంట సాగు విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్, తదితర అంశాలపై ఆరా తీశారు. అలాగే ఎన్ని ఎకరాల్లో ఈ కూరగాయల పంటలను వేశారు? అని రైతును అడుగగా, పొట్లకాయ సాగు రెండు ఎకరాల్లో వేశామని, సొరకాయ సాగు ఒక ఎకరంలో వేశామని, దొండ కాయ సాగు అర ఎకరంలో వేశామని *రైతు, కలెక్టర్ కు* వివరించారు. అదే విధంగా పండిన కూరగాయలను ఎక్కడ విక్రయిస్తున్నారు? ఏ మార్కెట్లకు తరలిస్తున్నారు? ధరలు ఎలా ఉన్నాయి? అనే విషయాలపై కూడా సమగ్రంగా చర్చించారు. అనంతరం పొలంలో ఉన్న పత్తి పంటను కూడా పరిశీలించిన *కలెక్టర్*, పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

బీర్ల ఐలయ్య ఎం ఎల్ ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని విమర్శించడం తగదు :బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్

జనగామ, ఆగష్టు 29,పున్నమి జిల్లా ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన కుటుంబం స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన కుటుంబ మని 22 ఏ నిషేధిత భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై రెవెన్యూ శాఖను ఎండగడుతూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు 22 ఏ నిషేధిత జాబితాను అడ్డం పెట్టుకొని అక్రమంగా అనేక లావాదేవీలు జరిగాయని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని ఈ విషయాలపై అనేక ఆధారాలతోటి బిజెపి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చర్చలకు రమ్మంటే ఆధారాలతోటి ఐదు గంటలు వేచి చూసిన కూడా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ మంత్రి మరియు రాష్ట్ర ప్రతినిధులు చర్చకు రాకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి నిదర్శనం అని దీనిని దృష్టిలో పెట్టుకొని బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని విమర్శించడం తన అజ్ఞానానికి నిదర్శనమని బిజెపి ఫ్లోర్ లీడర్ ను ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి తనకు లేదని మాట్లాడే ముందు తమ స్థాయి తెలుసుకొని మాట్లాడాలని ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని వారు తెలిపారు 22a నిషేధిత భూముల బహిర్గతపరిచి జాబితాలో ప్రైవేటు భూములు ఉన్న నిరుపేదల రైతుల భూములు ఉన్నట్లయితే సవరించి పేదలకు రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్, బొజ్జపల్లి సుభాష్, అంజి రెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

22 ఏ కింద నమోదైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి వివరాలు వెంటనే సమర్పించాలి :

22-ఏ కింద నమోదైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములను గుర్తించి వెంటనే వివరాలు సమర్పించాలి —————————————————————– జనగామ, ఆగష్టు 27,పున్నమి ప్రతినిధి : భూభారతి–22-ఏ నమోదుల్లో వ్యత్యాసాలను పోర్టల్‌లోనే పరిష్కరించాలి రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ 22-ఏ కింద నమోదు అయిన వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను గుర్తించి, నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరచి, వివరాలు సమర్పించాలని *రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్* కలెక్టర్లను ఆదేశించారు. గురువారం, హైదరాబాదు నుంచి *రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్* రాష్ట్రంలోని భూభారతి, 22-ఏ, సమగ్ర రీసర్వే చేసేందుకు నిర్దేశించిన అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో *రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్* మాట్లాడుతూ.. భూ భారతి డేటా ఆధారంగా ఎక్కడైనా 22-ఏ విస్తీర్ణంలో తేడాలు వస్తే వాటిని భూ భారతి పోర్టల్ లోనే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 22-ఏ కింద నమోదు అయినట్లు ఉంటే వాటిని గుర్తించి, నిర్ణీత ప్రొఫార్మాలో తహసీల్దార్ల నుంచి సేకరించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందుకోసం ప్రామాణిక కార్యాచరణ విధానం అమలు చేయాలని తెలియజేశారు. ఎస్ఆర్ఓలో వచ్చిన ఫిర్యాదులను ఏ రోజుకు ఆరోజే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సమగ్రంగా భూముల రీ సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, వాటి సత్ఫలితాల ఆధారంగా అన్ని గ్రామాల్లో రీ-సర్వే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వీసీ అనంతరం సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 22-ఏలో నమోదు అయిన వాటిని గుర్తించి, వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో భూముల రీ సర్వే నిర్వహించే విధంగా సర్వేయర్లను నియమించి, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ భారతిలో గల వివిధ మాడ్యూల్స్ లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, జీపీపీ, పీపీబీ, నాలా, తదితరాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ మన్యంకొండ, డీ – సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జాతీయ పురస్కారం కు ఎంపికైన మాన్యపు భుజేందర్

విశ్వ సాహితీ వేత్త జాతీయ పురస్కారం కు ఎంపికైన మాన్యపు భుజేందర్ —————————————————————— జనగామ,ఆగష్టు 27,పున్నమి జిల్లా ప్రతనిధి :శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం, చెందోడు గ్రామానికి చెందిన ఎం వి రావు ఫౌండేషన్ వారు సెప్టెంబర్ 6న నెల్లూరు పట్టణంలోని టౌన్ హాల్ లో తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్వహించనున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం, అలాగే తెలుగు భాషా దినోత్సవం జాతీయ వేడుకలను ఒకే వేదికపై నిర్వహించ తల పెట్టినారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వందమంది ఉపాధ్యాయులను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పురస్కారంతో, తెలుగు భాష వెలుగు కొరకు విశేష కృషి చేస్తున్న వందమంది సాహితీవేత్తలకు వివిధ ప్రాచీన నవీన కవుల పేర్లతో పురస్కారాలను ప్రముఖులైన అతిధుల సమక్షంలో ప్రధానం చేయ సంకల్పించినారు. ఈ క్రమంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన కవి, కళాకారుడు పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ సాహితీ రంగంలో చేస్తున్న కృషిని గుర్తించి ఆయన్ను విశ్వ సాహితీవేత్త జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎం వి రావు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మన్ శ్రీ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, సంస్థ కార్యదర్శి శ్రీమతి ముప్పవరపు విజయలక్ష్మి పంపిన ఎంపిక ధ్రువీకరణ పత్రాన్ని మాన్యపు భుజేందర్ అందుకున్నారు. ఈ పురస్కారానికి ఎంపికైనందుకు జనగామ జిల్లా కవులు కళాకారులు సాహితీవేత్తలు అభిమానులు భుజేందర్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

జనగాం

మెగా రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన జనగామ డిసీపీ రాజమహేంద్ర నాయక్

మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జనగామ DCP రాజమహేంద్ర నాయక్ —————————————————————— జనగామ, ఆగష్టు 26,పున్నమి జిల్లా ప్రతినిధి : జనగామ: ప్రపంచ మానవాళికి మార్గదర్శకులైన మహ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (TSMESA) జనగామ జిల్లా శాఖ, హమ్ సాత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జనగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని జనగామ DCP రాజమహేంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా DCP రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ, మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మైనారిటీ ఉద్యోగులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహ్మద్ ప్రవక్త బోధించిన మానవత, ప్రేమ, దయ, సేవా భావం, సోదరభావం వంటి గొప్ప విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాలని సూచించారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. TSMESA జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలి మాట్లాడుతూ, మహ్మద్ ప్రవక్త జీవితం యావత్ సమాజానికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రవక్త గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, మానవతా సేవకు రక్తదానం గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. TPTF జనగామ జిల్లా అధ్యక్షుడు N.N. రాజు మాట్లాడుతూ, మైనారిటీ ఉద్యోగులు చేపట్టిన మెగా రక్తదాన శిబిరం ఎంతో గొప్ప కార్యక్రమమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మత సామరస్యం, సోదరభావం మరియు పరస్పర సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు ఇటువంటి మానవతా కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. హమ్ సాత్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా మాట్లాడుతూ, మహ్మద్ ప్రవక్త చూపిన మానవతా మార్గంలో నడుస్తూ సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రక్తదానం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి జీవనాధారం అందించవచ్చని, ఒకరి రక్తదానం మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రక్తదాన శిబిరానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మైనారిటీ నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, మస్జిద్ కమిటీల అధ్యక్షులు, సామాజిక కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై న రాజమహేంద్ర నాయక్ కేంద్ర ప్రభుత్వం IPS అవార్డ్ లభించిన సందర్భంగా వారిని శాలువా తో సన్మానం చేసి పూల బోకేతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మహ్మద్ అంకుషావలి, మహ్మద్ జలీల్, మహ్మద్ యాకూబ్ పాషా, N.N. రాజు, మహ్మద్ తహసీన్, మహ్మద్ ఖలీల్, మోహసిన్, జమాల్ షరీఫ్, షకీల్, మసీ ఉర్ రెహ్మాన్, సాజిద్, సలీం, అజారుద్దీన్, నూరుద్దీన్, ఖాళీం, అజీమ్, సయ్యద్ జహంగీర్ హుస్సేన్, ఇస్మాయిల్, ఎజాజ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మానవతా సేవ, రక్తదానం, మత సామరస్యం మరియు సోదరభావానికి ప్రతీకగా నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం సమాజానికి మానవతా సందేశాన్ని చాటిచెప్పింది.

జనగాం

టి ఆర్పి మైనారిటీ సెల్రా ష్ట్ర కార్యదర్శి ఎం.డి.అంజద్ పాషా కు సన్మానం

మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ముహమ్మద్ అంజద్ పాషాకు ఘన సన్మానం ——————————————————— జనగామ, ఆగష్టు 26,పున్నమి ప్రతినిధి : తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా నియమితులైన ముహమ్మద్ అంజద్ పాషా కు జనగామ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ , నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి అంజద్ పాషా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారానికి అంజద్ పాషా గారు కృషి చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ మాట్లాడుతూ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గా నియమించినందుకు మల్లన్న, మరియు రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు సల్మాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు, జిల్లా కార్యదర్శి మంద దిలీప్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీసా శ్రీధర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎం.డి. పాషా తదితర నాయకులు పాల్గొన్నారు.

జనగాం

వైద్య ఆరోగ్య సేవలపై అధికారుల తనిఖీలు

జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలపై అధికారుల తనిఖీలు – ఏఆర్టీ సెంటర్ సందర్శన ———————————————————— జనగామ, ఆగష్టు 26,పున్నమి జిల్లా ప్రతినిధి : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ వనపర్తి, దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు, చిన్నమడూరు, పెద్దమడూరు, సింగరాజుపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఉప కేంద్రాలలో నిర్వహిస్తున్న మాతా శిశు కార్యక్రమాలు, టీకాల కార్యక్రమాలు, NCD కార్యక్రమాలు, TB కార్యక్రమాలు, కాలానుగుణ వ్యాధుల నియంత్రణ చర్యలు మరియు మందుల నిల్వలను పరిశీలించి, వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారాలలోపు నమోదు చేయాలని, 30 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ అసంక్రమిత వ్యాధుల (NCD) నివారణలో భాగంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా మందులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా 0–15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందించాలని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (HPV) నిరోధక టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, కాలానుగుణ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. *ART సెంటర్ సందర్శన* అనంతరం ఎయిడ్స్ కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ డా. అనురాధ, జిల్లాలోని ART సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ART సెంటర్‌లో అందిస్తున్న వైద్య సేవలు, కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ వనపర్తి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. శ్రావ్య, డా. సిద్ధార్థ, DPM మాధురి, తదితరులు పాల్గొన్నారు. *41వ నేత్రదాన పక్షోత్సవాల ప్రారంభం* అదే విధంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ, జనగాం ఆధ్వర్యంలో జనగాం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 41వ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి దృష్టిని అందించే అవకాశం ఉన్నందున, నేత్రదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి పాల్గొన్నారు.

జనగాం

మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా క్రీడలు

మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్బంగా యువతీ యువకులకు క్రీడోత్సవాలు —————————————————————- జనగామ, ఆగష్టు 26,పున్నమి జిల్లా ప్రతినిధి : స్థానిక మినీ స్టేడియం, ధర్మ కంచ, జనగామలో మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని యువతీ యువకులకు ఈ క్రింది క్రీడల్లో పోటీలు స్థానిక మినీ స్టేడియం ధర్మకంచలో నిర్వహించడం జరుగుతుంది కావున ఆసక్తిగల క్రీడాకారులు ఈ క్రీడా పోటీలలో పాల్గొనగలరు. 1.అథ్లెటిక్స్ 16 సంవత్సరాల లోపు బాలబాలికలకు మరియు 16 సంవత్సరాల పైన ఉన్న బాలబాలికలకు. 100, 400, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ మరియు షాట్ పుట్ మరియు 2.షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు, డబుల్స్ మాత్రమే ఓపెన్ టూ అల్ బాల బాలికలకు పోటీలు ఉండును. పోటీలు 27-08-2026 రోజున ఉండును, అథ్లెటిక్స్ లో పాల్గొనే క్రీడాకారులు మరియు షటిల్ బ్యాడ్మింటన్ లో పాల్గొనే క్రీడాకారులు 27 ఆగస్టు 2026 రోజున ఉదయం 7 గంటలకు జనన ధ్రువీకరణపత్రంతో, స్థానిక మినీ స్టేడియం, ధర్మకంచ, జనగామలో హాజరుకావలెను అని N.L. నరసింహ రావు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, జనగామ తెలిపారు.

జనగాం

మహిళా సంఘాలే మాదకద్రవ్య రహిత సమాజానికి సంఘ మిత్రులు

మహిళా సంఘాలే మాదకద్రవ్య రహిత సమాజానికి ‘సంఘమిత్రలు’ —-వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేత ————————————————————– జనగామ, ఆగష్టు 26,పున్నమి జిల్లా ప్రతినిధి : *మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి మహిళ భాగస్వామి కావాలి* *112కు సమాచారం ఇవ్వండి.. యువత భవిష్యత్తును కాపాడండి* *వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత* *జనగామను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి మహిళ తన కుటుంబంతో పాటు గ్రామాలను, పట్టణాలను కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే “సంఘమిత్ర”గా వ్యవహరించాలని *వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత* పిలుపునిచ్చారు. బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు “సంఘమిత్ర – మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు”ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి ముఖ్య అతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత* హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా *వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత* మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాయని, గర్భిణీలకు పోషకాహారం అందించడం నుంచి చిన్నారులకు మధ్యాహ్న భోజనం, అక్షరాస్యత, కుటుంబ సంక్షేమం, సామాజిక ఆడిట్ వంటి అనేక కార్యక్రమాల్లో మహిళలు ముందుండి పనిచేస్తున్నారన్నారు. జనగామ జిల్లాలో మహిళల చైతన్యం ప్రత్యేకమని పేర్కొంటూ, ఆ చైతన్యాన్ని సమాజ భద్రత కోసం వినియోగించాలని కోరారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 26 లక్షల జనాభాకు కేవలం 3 వేల మంది పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారని, అందువల్ల మహిళా సంఘాల సహకారం అత్యంత అవసరమని వివరించారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే సమిష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. యువతే రాష్ట్ర భవిష్యత్తు అని, వారిని కాపాడటం ప్రతి కుటుంబం, ప్రతి మహిళా సంఘం బాధ్యత అని స్పష్టం చేశారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్ప్రభావం వెంటనే కనిపించకపోయినా కొంతకాలానికి మెదడు, నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని నేరస్తులుగా చూడడం సరికాదని, వారికి చికిత్స అందించి, తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. మహిళా సంఘాలు సామాజిక మార్పుకు బలమైన వేదికలుగా ఉన్నాయని, పోలీస్ శాఖలో ఉన్న పరిమిత సిబ్బందితో పోలిస్తే మహిళా సంఘాల ద్వారా లక్షలాది మందికి అవగాహన కల్పించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి మహిళా సంఘ సమావేశంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళల భద్రత వంటి అంశాలపై తప్పనిసరిగా చర్చించాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసైనట్లు తెలిసినా, గంజాయి విక్రయాలు, రవాణా (లేదా) వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే 112కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు అవసరమైతే బహుమతులు కూడా అందజేస్తామని వెల్లడించారు. పాఠశాల నిర్వహణ కమిటీల్లో ఉన్న మహిళా సభ్యులు విద్యార్థుల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పదో తరగతి (లేదా) ఇతర తరగతుల విద్యార్థులు అకస్మాత్తుగా పాఠశాలకు రాకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడం వంటి అంశాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సంఘమిత్ర కార్యక్రమం ఒకరోజు కార్యక్రమంతో ముగిసేది కాదని, ఇకపై మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యల సమావేశాల్లో పోలీసు అధికారులు క్రమం తప్పకుండా పాల్గొని, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు మహిళా సంఘాలే ప్రధాన శక్తిగా నిలవాలన్నారు. జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వీరి ద్వారా ప్రతి ఇంటికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని తీసుకెళ్లవచ్చని చెప్పారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబాల్లో గృహ హింస, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామ మహిళా సంఘాలు, సంఘ సమాఖ్యలు, కాలనీ సమావేశాల్లో చర్చించి, యువతను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా *డీసీపీ రాజమహేంద్ర నాయక్* మాట్లాడుతూ.. జనగామ జిల్లా మహిళా సంఘాలు రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన సంఘాలుగా గుర్తింపు పొందాయన్నారు. డ్రగ్స్ మొదట సరదాగా ప్రారంభమై చివరకు ప్రాణాంతక వ్యసనంగా మారుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు, ఆలస్యంగా ఇంటికి రావడం, రాత్రిళ్లు మేల్కొని ఉండడం, కొత్త స్నేహాలు, చేతులపై ఇంజెక్షన్ గుర్తులు, పెదాలు నల్లబడటం వంటి లక్షణాలను గమనించాలని సూచించారు. సమస్యను దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు (లేదా) డీ-అడిక్షన్ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని కోరారు. మాదకద్రవ్యాల నియంత్రణకు అమలులో ఉన్న ఎన్‌డీపీఎస్ చట్టం–1985 ప్రకారం గంజాయి సేవించడం, విక్రయించడం, రవాణా చేయడం, దాచిపెట్టడం వంటి నేరాలకు కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయని వివరించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సదస్సులో సైకాలజిస్ట్ డా. విజయక్రాంతి మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలు, చికిత్స, పునరావాసంపై పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అలాగే డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికల రూపంలో హృద్యంగా ప్రదర్శించి సందేశాన్ని అందించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై వారందరూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, చాకలి ఐలమ్మ సమాఖ్య నాయకురాలు మమత, ఇతర పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.