జనగాం
*కలెక్టరేట్ ప్రాంగణంలో ‘ఇండిపెండెన్స్ గార్డెన్’కు శ్రీకారం* ———————————————– జనగామ, ఆగష్టు 15,పున్నమి ప్రతినిధి s *స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా మామిడి తోట.. భవిష్యత్ తరాలకు పచ్చని కానుక* స్వేచ్ఛా భారతాన్ని మరింత సుసంపన్నంగా, ఆరోగ్యవంతంగా, పచ్చదనంతో నిండిన దేశంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ బాధ్యతలో ప్రకృతి పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. మనం నేడు నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, చల్లని నీడ, పండ్లు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఒక చిన్న మొక్కను నాటడం అంటే కేవలం ఒక చెట్టుకు జీవం పోయడం కాదు.. భావితరాల భవిష్యత్తుకు భరోసా కల్పించడం. మొక్క నాటడం ఒక చిన్న కార్యక్రమంలా కనిపించినా.. దాని వెనుక ఉన్న ఆలోచన ఎంతో గొప్పది. ఈ రోజు నాటిన చిన్న మొక్క రేపు మహా వృక్షంగా ఎదిగి నీడనిస్తుంది. పూలు, పండ్లు అందిస్తుంది. పక్షులకు ఆవాసమవుతుంది. ముఖ్యంగా భవిష్యత్ తరాలకు “మన కోసం ఎవరో ఒకరు ఒక మొక్క నాటారు” అనే మధురమైన జ్ఞాపకాన్ని మిగుల్చుతుంది. జిల్లా కలెక్టరేట్ వెనుక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఇండిపెండెన్స్ గార్డెన్’ (మామిడి పండ్ల తోట) ఈ ఆలోచనకు ప్రతిరూపంగా నిలిచింది. *కలెక్టర్ ప్రత్యేక చొరవతో పచ్చని ఆలోచనకు రూపం* కలెక్టరేట్ అనేది ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపే పరిపాలనా కేంద్రం. అలాంటి ప్రాంగణంలోనే పచ్చదనాన్ని పెంపొందించేలా మామిడి పండ్ల తోటను ఏర్పాటు చేయడం ఒక వినూత్న ఆలోచనగా నిలిచింది. *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ప్రత్యేక చొరవతో ఈ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ఖాళీ ప్రదేశాలను నిరుపయోగంగా వదిలేయకుండా వాటిని పచ్చని ప్రదేశాలుగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చనే సందేశాన్ని ఈ తోట అందిస్తోంది. *మామిడి మొక్కలో దాగిన మధురమైన సందేశం* మామిడి చెట్టు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగినది. వేసవిలో చల్లని నీడనిచ్చే చెట్టు.. కాలానుగుణంగా పండ్లను అందించే జీవ వనరు.. ఎన్నో జీవరాశులకు ఆశ్రయం కల్పించే ప్రకృతి సంపద. నేడు నాటిన చిన్న మొక్క కొన్ని సంవత్సరాల తర్వాత విస్తారమైన కొమ్మలతో ఎదిగి, పచ్చని ఆకులతో కళకళలాడుతూ, మామిడి పండ్లను అందిస్తుంది. అందుకే ఈ తోటలో నాటిన ప్రతి మొక్క ఒక సాధారణ మొక్క కాదు.. ఒక జ్ఞాపకం, ఒక బాధ్యత, ఒక భవిష్యత్ ఆశ. *పండ్లలో రారాజు “మామిడి”* మామిడి మొక్కను ఎంచుకోవడానికి ప్రధాన కారణం “పండ్లలో రారాజు మామిడి” అనే ప్రత్యేకత. మన దేశంలో మామిడికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రుచికరమైన పండును అందించడంతో పాటు, మామిడి చెట్టు దీర్ఘకాలం నీడను, పచ్చదనాన్ని అందిస్తుంది. అదే విధంగా, ఇండిపెండెన్స్ గార్డెన్లో మామిడి మొక్కను నాటడం భవిష్యత్ తరాలకు అభివృద్ధి, పచ్చదనం, ప్రకృతి పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. *పచ్చదనం పరిపాలనలో భాగం కావాలి* ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పచ్చగా ఉంచడం, పండ్ల మొక్కలను పెంచడం, ప్రకృతితో అనుసంధానమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఉద్యోగులు, సందర్శకుల్లో కూడా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుంది. *భావితరాల పచ్చని భవిష్యత్తుకు బాటలు* 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిలతో కలిసి ముఖ్య అతిథి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య* ‘ఇండిపెండెన్స్ గార్డెన్’ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పండ్ల మొక్కను నాటి గార్డెన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.