రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 26 ( పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని గూడూరు: గ్రామానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన పల్లగుట్ట పరిరక్షణ కోసం గూడూరు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఐక్యంగా కదిలారు. యువకులు, మహిళలు, పెద్దలు ఒకే వేదికపై నిలిచి “పల్లగుట్టను కాపాడుకుందాం.. భావితరాలకు అందిద్దాం” అంటూ నినదించారు. సర్వే నంబర్ 410లో, నామాపూర్ సరిహద్దుగా ఉన్న పల్లగుట్ట వర్షపు నీటిని ఒడిసిపట్టి తాగునీరు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడే ప్రకృతి సంపదగా నిలిచిందని ప్రజలు తెలిపారు. గతంలో సుమారు 60 ఎకరాలకు మైనింగ్ అనుమతులు వచ్చినప్పుడు గ్రామస్తులంతా ఏకమై తవ్వకాలను అడ్డుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం 11 ఎకరాలకు అనుమతులు పొందిన నేపథ్యంలో పల్లగుట్టను ధ్వంసం చేసే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పల్లగుట్ట కేవలం మట్టి, రాళ్ల గుట్ట కాదని, జీవరాశులకు ఆవాసంగా, భూగర్భజలాల పరిరక్షణకు ఆధారంగా ఉన్న ప్రకృతి వరమని పేర్కొన్నారు. ఈ సంపదను కాపాడటం నేటి తరానికి ఉన్న సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. నామాపూర్ ప్రజలు కూడా పరిరక్షణ ఉద్యమానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చీటి వెంకట నరసింహారావు, సిహెచ్. రమేష్, ఉపసర్పంచ్ తాటకార్ల ప్రభాకర్తో పాటు గ్రామ వార్డు సభ్యులు గ్రామ యువకులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.