ఈ సమావేశంలో రాబోయే శ్రీ వినాయక చవితి పండుగను శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా మరియు చట్టబద్ధంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనలు, సంబంధిత శాఖల నుండి తీసుకోవలసిన అనుమతులు, శబ్ద కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడటం, విద్యుత్ భద్రతా చర్యలు, విగ్రహాల నిమజ్జన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండడం వంటి అంశాలపై సమగ్రంగా వివరించడం జరిగింది.
అదేవిధంగా, స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి, ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడరాదని, రాజకీయ విభేదాలను వ్యక్తిగత శత్రుత్వాలుగా మార్చుకోరాదని, శాంతి భద్రతలను కాపాడడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించడం జరిగింది.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, అధిక వేగంతో మరియు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని సూచించడం జరిగింది.
మహిళలపై జరిగే నేరాల (Crime Against Women) నివారణకు సంబంధించి మహిళల భద్రత, గృహ హింస, వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, స్టాకింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించడం జరిగింది.
మాదక ద్రవ్యాల (Anti Drugs) నిర్మూలనలో భాగంగా గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత మరియు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, మాదక ద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం మరియు వినియోగం చట్టరీత్యా శిక్షార్హమైన నేరాలని వివరించడం జరిగింది. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించడం జరిగింది.
విద్యార్థుల పాత్రపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ, చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలని, చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాలు మరియు నేరప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించడం జరిగింది. సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలలో మైనర్ల ప్రమేయం పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, మొబైల్ ఫోన్ వినియోగంపై నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని తెలియజేయడం జరిగింది.
పోక్సో (POCSO) చట్టం గురించి వివరించి, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు మరియు అనుచిత ప్రవర్తనలకు సంబంధించి కఠినమైన శిక్షలు ఉన్నాయని, పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించడం జరిగింది. మైనర్లను నేరాలకు ప్రోత్సహించడం, వారిని నేర కార్యకలాపాలలో ఉపయోగించడం కూడా చట్టరీత్యా శిక్షార్హమైనదని తెలియజేయడం జరిగింది.
ఆన్లైన్ లోన్స్, ఫేక్ లోన్ యాప్స్, సోషల్ మీడియా మోసాలు, పెట్టుబడి మోసాలు, ఒటిపి (OTP) మోసాలు, బ్యాంక్ ఖాతాల దుర్వినియోగం వంటి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం పెరుగుతున్న “డిజిటల్ అరెస్ట్” మోసాల గురించి వివరించి, పోలీసు అధికారులు, సీబీఐ, ఈడీ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పి వీడియో కాల్స్ ద్వారా బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల మాటలను నమ్మరాదని సూచించడం జరిగింది. ఎలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించడం జరిగింది.
అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, యువతలో మంచి అలవాట్ల పెంపొందింపు, సామాజిక బాధ్యత, చట్టాల పట్ల అవగాహన మరియు ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ వంటి అంశాలపై కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివిధ సామాజిక, చట్టపరమైన, భద్రతా మరియు ఆరోగ్య సంబంధిత అంశాలపై సమగ్ర అవగాహన కల్పించి, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరడం జరిగింది…..


