అరకులోయ మండల పరిధిలో పీఎం జన్మన్ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇంటింటా బీజేపీ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారని తెలిపారు. గత ఆరు నెలలుగా బిల్లులు ఆపేశారని, ఆధార్, అకౌంట్ అప్డేట్ల పేరుతో కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వాపోయారన్నారు.
కేంద్ర ప్రభుత్వం పీవీటీజీల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పథకానికి బిల్లులు చెల్లించకపోవడం తగదని బీజేపీ నేత రామచందర్ అన్నారు. పథకం గడువు ముగుస్తుండడంతో లబ్ధిదారులు బంగారం, పొలాలు తాకట్టు పెట్టి ఇళ్లు నిర్మిస్తున్నారని, వెంటనే బిల్లులు చెల్లించి నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


