కార్మిక వర్గం భారీగా తరలిరావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ పిలుపు
రామగుండం, సెప్టెంబర్ 03: ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను పురస్కరించుకుని సెప్టెంబర్ 6న నిర్వహించనున్న భారీ కార్మిక ప్రదర్శన, బహిరంగ సభకు కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం ఎన్టీపీసీ నంబర్ 2 గేట్ ఎదుట మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కడారి సునీల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలకు, ఉద్యమాలకు, విప్లవాలకు కరీంనగర్ గడ్డ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న కరీంనగర్ జిల్లాలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. మహాసభల్లో భాగంగా సెప్టెంబర్ 6న అంబేద్కర్ స్టేడియం నుంచి సర్కస్ గ్రౌండ్ వరకు భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు కడారి సునీల్ తెలిపారు. అనంతరం సర్కస్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. ఈ బహిరంగ సభకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్‌తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు, ఏఐటీయూసీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర మహాసభల్లో ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, కార్మిక ఉద్యమాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు రానున్న రోజుల్లో చేపట్టాల్సిన భవిష్యత్ పోరాటాలపై విస్తృతంగా చర్చించి కార్యాచరణను రూపొందించనున్నట్లు కడారి సునీల్ తెలిపారు. కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేసే దిశగా మహాసభల్లో నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు సాగి మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నాంసాని శంకర్, జిల్లా కోశాధికారి రెడ్డపాక లక్ష్మణ్, రామగుండం నగర అధ్యక్షులు అబ్దుల్ కరీం, కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


