ప్రహరీ గోడ లేక ఆక్రమణకు గురైన ఆలయ స్థలాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లికి చూపించిన గ్రామస్థులు
బలభద్రపురం, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ గుబ్బాలమ్మ దేవస్థానానికి చెందిన స్థలం ఆక్రమణకు గురైన విషయాన్ని గ్రామస్థులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి ప్రహరీ గోడ లేకపోవడంతో ప్రాంగణానికి రక్షణ లేకుండా పోయిందని, ఈ కారణంగా ఆలయ స్థలంలో కొంత భాగం ఆక్రమణకు గురైందని ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ఎమ్మెల్యేకు ప్రత్యక్షంగా చూపించి, ఆలయ స్థలాన్ని పరిరక్షించేందుకు ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయ స్థలం భవిష్యత్తులో మరింత ఆక్రమణకు గురికాకుండా శాశ్వత రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామస్థుల నుంచి సమస్య వివరాలను తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆలయ స్థలాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల కూటమి నాయకులు, బలభద్రపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.



