పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
యలమంచిలి : స్థానిక సబ్ జైలును సోమవారం ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి జి. స్పందన సందర్శించి, తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె జైలులోని ముద్దాయిలతో నేరుగా మాట్లాడి, వారి కేసు వివరాలను మరియు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయవాదిని పెట్టుకోలేని రిమాండ్ ఖైదీలకు ఉచితంగా ప్రభుత్వ న్యాయవాది (లీగల్ ఎయిడ్) సహాయాన్ని అందించి, బెయిల్ పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖైదీలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉన్నా, జైలులో ఇతరత్రా ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఖైదీలకు చట్టపరంగా అందాల్సిన సౌకర్యాలను సరిగ్గా అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సబ్ జైలు అధికారులు, జైలు సిబ్బంది, కోర్టు/న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


