సారపాక: బూర్గంపాడు మండలం సారపాకలోని గబ్బర్‌సింగ్ హోటల్లో శుక్రవారం సాయంత్రం తోటకూర పకోడీ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి అందులో తాళం చెవి కనిపించడం కలకలం రేపింది. పకోడీతో పాటు తాళం చెవి దర్శనమివ్వడంతో వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. రాఖీ పండుగ సందర్భంగా పకోడీలకు స్పెషల్ గిఫ్ట్‌గా తాళం చెవి వచ్చిందంటూ పలువురు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
సాంబార్, తోటకూర పకోడీలను రూ.25 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉండగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ ఏరియా కావడంతో సారపాకలో హోటళ్లు, కర్రీ పాయింట్లు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి ఆహార నాణ్యతపై పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు. ఇటీవల భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పటికీ సారపాకలోనూ కర్రీ పాయింట్లు, హోటళ్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. పకోడీలో తాళం చెవి కనిపించకుండానే తినేసి ఉంటే పరిస్థితి ఏమిటని వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. డబ్బులు తీసుకుని ఆహార పదార్థాలను నిర్లక్ష్యంగా తయారు చేయడం సరికాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Uploaded Video:


