తెలంగాణను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు, 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడంలో పర్యాటక రంగాన్ని కీలక భాగస్వామిగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
మంగళవారం డా బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి పర్యాటక ప్రాంతాలు గుర్తింపు, విజన్ 2047 కార్యాచరణ అమలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ లక్ష్య సాధనలో భాగంగా రూపొందించిన తెలంగాణ టూరిజం విజన్ 2047’ కార్యాచరణ ప్రణాళికలో పర్యాటకుల అనుభూతిని మెరుగుపరచడం, స్థానిక ప్రాంతాల ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులను మెరుగుపరచి, ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించాలని తెలిపారు. హోమ్‌స్టేలు, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ల ద్వారా స్థానికులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచనున్నట్లు తెలిపారు.
ఏఐ ఆధారిత ఇటినరరీ ఇంజిన్, ‘తెలంగాణ పాస్’ డిజిటల్ వాలెట్, రియల్‌టైమ్ డేటా డ్యాష్‌బోర్డుల ద్వారా పర్యాటకులకు ఆధునిక డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు బతుకమ్మ, బోనాలు, మేడారం జాతర వంటి ప్రత్యేక ఉత్సవాలను గ్లోబల్ ఈవెంట్లుగా అభివృద్ధి చేయాలన్నారు. ప్లాస్టిక్ రహిత, కార్బన్-న్యూట్రల్ పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించి సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని స్పష్టంచేశారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ 100 వీకెండ్ గేట్‌వే గమ్యస్థానాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూపాలపల్లి జిల్లాలోని పాండవులగుట్ట, ఘన్‌పూర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ (కోటగుళ్లు), శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, రెడ్డి గుడి, సావత్‌భద్ర ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ముడుగుల్ల దేవాలయం వంటి ప్రాంతాలను వారాంతపు పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసే అవకాశాలను ప్రణాళికలో గుర్తించామని తెలిపారు.
ఈ ప్రాంతాలకు సమీపంలోని రామప్ప ఆలయం, రామప్ప సరస్సు, లక్నవరం సరస్సు, వేయి స్తంభాల ఆలయం, మైలారం గుహలు, ఘన్‌పూర్ సరస్సు, నైనపాక, కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, గట్టమ్మ ఆలయం, కాళేశ్వరం త్రికూట ఆలయ సముదాయం వంటి పర్యాటక ప్రాంతాలను అనుసంధానించడం ద్వారా సమగ్ర టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా
ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యావరణ, జలపాతాలు, సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, రామప్ప, అలంపూర్, చార్మినార్, గోల్కొండ, కుంటాల జలపాతం, బౌద్ధ పర్యాటక ప్రాంతాలు ఇందులో కీలకంగా ఉన్నాయని వివరించారు.
సురక్షితమైన పర్యాటకానికి ప్రోత్సాహం
పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ‘మహిళా మిత్ర’ నెట్‌వర్క్, అత్యవసర పానిక్ బటన్లు, సీసీటీవీ నెట్‌వర్క్ వంటి సదుపాయాలను విస్తరించనున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో చార్మినార్ నుంచి గోల్కొండ వరకు ‘హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ మైల్’, నైట్ బజార్లు, ఫుడ్ ఫెస్టివల్స్ ద్వారా పర్యాటక వ్యవస్థను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
ప్రజా భాగస్వామ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక సంస్కృతి–సంప్రదాయాలను సమన్వయం చేస్తూ తెలంగాణను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా, అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే ‘తెలంగాణ టూరిజం విజన్ 2047’ ప్రధాన లక్ష్యమని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు.
ఐడిఓసి కార్యాలయం నుండి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మీ, పర్యాటక అధికారి రఘు, తదితరులు పాల్గొన్నారు.


