నిద్ర మత్తులో అధికారులు.. ఎనిమిది నెలలుగా కొత్తపల్లి కరెంటు కష్టాలు!
పట్టించుకోని అధికారులు
కొత్తపల్లి : గ్రామంలో గత ఎనిమిది నెలలుగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేపదే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ కోతల కారణంగా తాగునీటి సరఫరా, విద్యార్థుల చదువులు, రైతుల వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా హామీలకే పరిమితమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
Md ghani విలేజ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కావలి బాలయ్య మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలలుగా గ్రామంలో విద్యుత్ సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిద్ర మత్తులో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోని విద్యుత్ సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని బాలయ్య డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామస్తులతో కలిసి సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.



