చిట్వేల్, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
చిట్వేల్ మండలంలోని పోలోపల్లి, మైలపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో రైతులకు నానో ఎరువులు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ జి. సుధాకర్ మాట్లాడుతూ, నేల ఆరోగ్యం కాపాడటం, పర్యావరణాన్ని సంరక్షించడం, నాణ్యమైన పంటలు పండించడం కోసం రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడటం అవసరమని సూచించారు. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, పిల్లి పెసర, జీలగలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా 25 శాతం వరకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.నానో యూరియా, నానో DAP వినియోగం ద్వారా మొక్కలకు అవసరమైన పోషకాలు సమర్థవంతంగా అందుతాయని, వృథా తగ్గుతుందని ఆయన వివరించారు. జీవన ఎరువులైన రైజోబియం, అజోల్లా, అజోస్పిరిల్లుమ్ వాడకం వల్ల వాతావరణ నత్రజని మొక్కలకు అందుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో PDMS కిట్స్, ఘన జీవామృతం, బీజామృతం వాడటం ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గి అధిక దిగుబడులు సాధ్యమని రైతులకు అవగాహన కల్పించారు.యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మోతాదు మించితే చీడపీడల సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. మండలంలో యూరియా కొరత లేదని, అవసరానికి తగ్గట్టు రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ షాపుల ద్వారా సరఫరా జరుగుతోందని తెలిపారు. ఎవరూ పుకార్లను నమ్మకూడదని, అవసరానికి మించి ఎరువులు నిల్వ చేయరాదని హెచ్చరించారు. అక్రమంగా యూరియా నిల్వ చేసినా, MRP మించి అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి శ్రీ లోకేష్, రైతు సేవా కేంద్ర సిబ్బంది, గ్రామాల రైతులు పాల్గొన్నారు.


