ఖమ్మం, ఆగస్టు 8
(పున్నమి జిల్లా స్టాఫ్ రిపోర్టర్)
: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ వివరాలు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గురువారం సాయంత్రం ఐదుగురు యువకులు గంజాయి సేవించేందుకు గంజాయి పొట్లాలతో చేరారు. అదే సమయంలో అటుగా పోలీస్ వాహనం రావడాన్ని గమనించిన వారు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసుల విచారణలో వారు కొంతకాలంగా గంజాయిని సేవిస్తున్నట్లు అంగీకరించినట్లు ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 250 గ్రాముల గంజాయిని, దాని విలువ సుమారు రూ.15 వేలుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వారి వద్ద ఉన్న నాలుగు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన వారిలో ఖమ్మం పట్టణానికి చెందిన యిటిగల సాయి గణేష్, రెంటల ధనుష్ కుమార్, ఎండీ అరీఫ్ అహ్మద్, పోగుల సిద్ధూ, సూర్యాపేటకు చెందిన బత్తుల ఉదయ్ కిరణ్ ఉన్నారు.
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం వారిని ఖమ్మం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


