తిరుపతి (ఎస్వీయూ) ఆగస్టు 07 పున్నమి ప్రతినిధి
పరిశోధన నైతికత (సమకాలీన దృష్టి) అనే అంశంపై మూడు రోజుల కార్యశాల శుక్రవారం ముగిసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత నాణ్యత గల పరిశోధన చేయడానికి విద్యాపరమైన సమగ్రత మరియు పరిశోధన నైతికత చాలా కీలకమని నొక్కి చెప్పారు. సిడిసి డీన్ ఆచార్య ఎన్సీ రాయుడు మాట్లాడుతూ సరైన సైటేషన్, రిఫరెన్సింగ్ పద్ధతులు, కాపీరైట్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా సాహిత్య చోర్యాన్ని (ప్లేజియరిజం) పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. అలగప్ప విశ్వవిద్యాలయ ఆచార్యులు గణేశన్ మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనా పత్రాలను రూపొందించడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనా సాధనాలను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ఆయన పరిశోధకులను కోరారు. కార్యక్రమం నిర్వాహకుడు ఆచార్య కొంగర సురేంద్ర బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వర్సిటీ గ్రంథాలయం రూసా ఫేజ్-1 సహకారంతో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 12 మంది ప్రముఖ నిపుణులు ద్వారా దాదాపు 200 మంది పరిశోధకులకు సమగ్ర శిక్షణను అందించినట్లు ఆయన అన్నారు. ఈ వర్క్ షాప్ లో పరిశోధకులకు పరిశోధన నైతికత, అకడమిక్ రచన, శాస్త్రీయ ప్రచురణ, పరిశోధనా పద్ధతి, సైటేషన్ పద్ధతులు, కాపీరైట్ మార్గదర్శకాలు, ప్లేజియారిజంను గుర్తించే సాధనాలు, ఏ ఐ వినియోగం, డేటా నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చామని తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదగా పరిశోధకులకు విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు, గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.

