పందలపాక, ఆగస్టు 7 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బిక్కవోలు మండలం పందలపాకలో నిర్వహించిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 ఏళ్లుగా చేనేత రంగానికి సేవలందిస్తున్న పలువురు నేతన్నలను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ‘నేతన్నకు నేస్తం’ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్ రాయితీలు, పనిముట్లపై 90 శాతం సబ్సిడీ, అవసరమైన చోట్ల నూరుశాతం రాయితీతో షెడ్లు అందిస్తున్నామని చెప్పారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. అనపర్తి నియోజకవర్గంలోని ఐదు చేనేత సొసైటీలకు యునెస్కో గుర్తింపు సాధించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల చేనేత సొసైటీ సభ్యులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



