*స్వర్ణముఖిని కాపాడాలి!*
*భారీ యంత్రాలతో ఇసుక, మట్టి తవ్వకాలపై బీజేపీ నిరసన*
*కోట మండలంలో నీటి వనరుల పరిరక్షణకై వినతి*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 31 కోట మండలం,*
*నెల్లూరు జిల్లా కోట మండలంలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో భారీ యంత్రాలతో ఇసుక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కోట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. నది పరివాహక ప్రాంతంలో ఇసుక, మట్టి తవ్వకాలతో సహజ నీటి వనరులు దెబ్బతింటున్నాయని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వర్ణముఖి పరివాహక ప్రాంతం ఎడారిని తలపించే పరిస్థితికి చేరుతోందని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సత్తెన అంబరీష ఆరోపించారు. ఇసుక, మట్టి తవ్వకాల ప్రభావంతో జలవనరులు నశించి సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతంలోని పాడైన చెక్‌డ్యామ్‌లను రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన పునర్నిర్మించాలని కోరారు. ప్రకృతి వనరుల అక్రమ దోపిడీతో ప్రజలు, రైతులు నష్టపోతున్నారని తిరుపతి జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పోసిన వెంకయ్య గౌడ్ అన్నారు. ఇసుకను కొందరు తమ సొంత వనరులుగా భావించి ఇష్టారాజ్యంగా తరలించడం సరికాదని, ప్రకృతి వనరులు ప్రజలందరికీ చెందుతాయని పేర్కొన్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు సాగితే నదులు, వాగులు, నీటి ప్రవాహ మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. ఇసుక వనరుల దోపిడీతో నీటి నిల్వలు, భూగర్భ జలాలపై ప్రభావం పడటంతో పాటు వ్యవసాయం, ఆక్వా సాగుకు అవసరమైన నీటి లభ్యత తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని వెంకయ్య గౌడ్ ఆరోపించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పది ఎకరాల్లో సాగు చేసిన రైతులు ప్రస్తుతం నీటి కొరత కారణంగా రెండు ఎకరాలకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నీటి వనరులను సంరక్షించాల్సిన సమయంలో వాటికి అడ్డంకులు ఏర్పడటం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలోని చెక్‌డ్యామ్‌లు పాడైపోవడంతో పాటు అన్యాక్రాంతమయ్యాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. వర్షపాతం ద్వారా వచ్చే నీటిని సమర్థంగా నిల్వ చేసేలా పరివాహక ప్రాంతాన్ని పునరుద్ధరించాలని, సాగునీరు, తాగునీటికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు కోట ఆర్ఐ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించవద్దని వెంకయ్య గౌడ్ ప్రాంతీయ నాయకులకు సూచించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వాన్ని నడుపుతున్న నేపథ్యంలో స్థానికంగా జరిగే తప్పిదాలు సైతం కూటమి ప్రతిష్ఠపై ప్రభావం చూపుతాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి సహజ వనరుల దోపిడీని అడ్డుకోవాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యలకు సమాధానం చెప్పగలిగేలా నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు పాదర్తి కోటారెడ్డి, జిల్లా కోర్ కమిటీ సభ్యుడు దువ్వూరు గిరిధర్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి పోసిన వెంకయ్య గౌడ్, కోట మండల అధ్యక్షుడు గునుపూడి హరిబాబు, సామాజిక మాధ్యమాల ఇన్చార్జ్ సారంగం నికేష్, మండల కిసాన్ మోర్చా నాయకుడు శరత్ చంద్రారెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*



