పార్టీ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి
యువత, మహిళలకు ప్రాధాన్యమిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచన
రైల్వేకోడూరు నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సూచించారు. శనివారం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ప్రతి గ్రామం, మండలంలో పార్టీ బలాబలాలను అంచనా వేసుకుని, ప్రజల నుంచి స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ అధిష్టానం ఇచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సెప్టెంబర్ 2న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో జనసేన యువజన విభాగాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. యువత, మహిళలకు ప్రాధాన్యమిస్తూ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. పార్టీ అప్పగించే బాధ్యతలను క్రమశిక్షణతో, సమష్టిగా నిర్వహించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.













