సేనాని జన్మదిన వేడుకలకు ఘనంగా సన్నాహాలు
స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సమాయత్తం
సెప్టెంబర్ 2న సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి
పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 2న కొత్తవలస మండలంలో ఘనంగా నిర్వహించేందుకు జనసేన శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ మేరకు సోమవారం కొత్తవలసలోని ఎంకే విల్లాస్‌లో మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు, వైస్ ఎంపీపీ మేలాస్త్రి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సెప్టెంబర్ 2న మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కేక్ కటింగ్, సేవా కార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. జన్మదిన వేడుకలను ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని నాయకులు సూచించారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని మేలాస్త్రి అప్పారావు పిలుపునిచ్చారు. కొత్తవలస మేజర్ పంచాయతీతో పాటు మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ తదితర స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీ సన్నద్ధంగా ఉందన్నారు.
ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా భాగస్వామ్యం చేయాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ సన్నాహక సమావేశంలో కొత్తవలస మండలం జనసేన నాయకులు, శ్రీ మేలస్త్రి అప్పారావు , పిల్లా రామదుర్గ, పెదిరెడ్ల రాజశేఖర్ , మల్లువలస శ్రీను, గురజాడ వెంకటేష్ , గాలి అప్పారావు, రామదాసు కాశి, కరాటే లక్ష్మణ్, బంధం సత్తిబాబు, కోటి, సింగంపల్లి ఏర్నిబాబు, ఇతర ముఖ్య నాయకులు,కార్యకర్తలు, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.



