పున్నమి ప్రతినిధి ఆనంద్:
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట వీధిలో తాగునీటి కొళాయి పైపులైన్ లీకేజీతో విలువైన నీరు వృథాగా పోతోంది. లింగం డాక్టర్ ఇంటి ఎదురుగా, మామిడి కొండయ్య వీధిలో లీకేజీల కారణంగా నీరు రోడ్డుపైకి చేరి నిలిచిపోతోంది. మరోవైపు కాలువల్లో పారిశుద్ధ్యం లోపించడంతో దుర్వాసన, అపరిశుభ్రత నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ విషయాన్ని మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపిస్తున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో బురద, చెత్త పేరుకుపోయి దోమలు, ఈగల బెడద పెరిగే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉన్న సమయంలో పైపులైన్ ద్వారా నీరు వృథా కావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీలను అరికట్టి, నిల్వ నీటిని తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.


