మురుగు ముంపులో మునగనూరు..!
చెత్త, మురుగునీటితో నరకాన్ని తలపిస్తున్న రహదారులు
అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకునేవారేరీ?
తుర్కయంజాల్ సర్కిల్, ఆగస్టు
మునగనూరు ప్రజలకు పారిశుద్ధ్య సమస్యలు నిత్యకృత్యంగా మారాయి. రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్త, రోజుల తరబడి నిలిచిపోయిన మురుగునీటితో గ్రామ పరిసరాలు అధ్వానంగా మారాయి. మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రహదారులపైకి చేరుతోంది. దుర్వాసనతో పాటు దోమల బెడద పెరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పట్టించుకోని పాలకులు.. ఆవేదనలో ప్రజలు
పారిశుద్ధ్య సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించకపోవడం, డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వల్ల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని చెబుతున్నారు.
వర్షం వస్తే పరిస్థితి మరింత దారుణం
వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. మురుగు నిల్వల కారణంగా దోమలు పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా మేల్కొనాలి
గ్రామపంచాయతీ నుంచి గ్రేటర్ అధికారుల వరకు సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే మునగనూరులో క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


