పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.
అమలాపురం,పున్నమి దినపత్రిక: మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు, లోపాలకు తావులేకుండా ముందస్తు సన్నాహక ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు.బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ముందస్తు సన్నాహక ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితాల ప్రచురణ, ఎన్నికల సంబంధిత ప్రచురణలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల గుర్తింపు, రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ముందస్తు సన్నాహక చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 10,90,975 మంది ఓటర్లు ఉన్నారని, జిల్లాలోని 19 మండలాల పరిధిలో 342 గ్రామ పంచాయతీలకు సంబంధించి 3,878 వార్డులను గుర్తించినట్లు తెలిపారు. వీటి పరిధిలో మొత్తం 3,968 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్ల జాబితా పేజీలను నిబంధనల మేరకు పరిశీలించి, అవసరమైన చోట అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదిత ఓటర్ల జాబితా పేజీల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల గుర్తింపు, జాబితాల విభజన, ప్రచురణ తదితర ప్రక్రియలను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
*ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతం*
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల గుర్తింపు, వర్గీకరణ, వర్తింపు ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. డివిజన్, మండల స్థాయిల్లో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ఖచ్చితంగా సిద్ధం చేయాలని సూచించారు.రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వ మార్గదర్శకాలు, ఎన్నికల కమిషన్ నిబంధనలు, అమలులో ఉన్న చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
*ఎన్నికల సిబ్బందికి సమగ్ర శిక్షణ*
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణా తరగతులను నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పోలింగ్ విధానం, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, ఓటర్ల జాబితాల నిర్వహణ, ఎన్నికల సామగ్రి వినియోగం, విధులు–బాధ్యతలు, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు.శిక్షణ అనంతరం ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తమకు అప్పగించిన బాధ్యతలపై ఎటువంటి సందేహాలు లేకుండా చూడాలని, అవసరమైన చోట ప్రాక్టికల్ శిక్షణ కూడా అందించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు.
ముందస్తు ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన అన్ని ముందస్తు చర్యలను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది, శిక్షణ, రిజర్వేషన్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వి సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారిని శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.



