ఖమ్మం: సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సుపరిపాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాల్లో జననేతగా చిరస్థాయిగా నిలిచిపోయారని సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్ అన్నారు. బుధవారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా డీసీసీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి తో కలిసి వైస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పేదలకు సంక్షేమ పథకాలు వంటి అనేక కార్యక్రమాలతో ఆయన ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



