*ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ*
నాయుడుపేట :* ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. ఆమె మంగళవారం నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పబ్లిక్ హెల్త్ వర్కర్ల మరణించిన కుటుంబాలకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పని చేసి మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు స్వచ్ఛ మున్సిపాలిటీ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచించారు. తడి – పొడి చెత్తలను వేరు చేసి చెత్త సేకరణ కార్మికులకు అందించాలని కోరారు. అనంతరం తడి – పొడి చెత్తలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్ బకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా, పట్టణ పార్టీ అధ్యక్షులు 786 రఫీ, పార్టీ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

