పండుగ పూట గ్రామీణ ప్రాంతాలకు బస్సులు బంద్!
“బడి లేకపోతే బస్సులు కూడా బందేనా?” — ప్రయాణికుల ఆవేదన
ఇబ్రహీంపట్నం డిపో తీరుపై మహిళలు, యువత ఆగ్రహం
రంగారెడ్డి జిల్లా, ఆగస్టు 28:
పండుగ రోజున సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్టీసీ బస్సుల కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో పరిధిలోని పలు గ్రామీణ మార్గాల్లో పండుగ రోజున బస్సులు సరిగా నడవకపోవడంతో మహిళలు, యువకులు, వృద్ధులు, ఇతర ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు సాధారణ రోజుల్లో అందుబాటులో ఉండే బస్సులు పండుగ రోజు మాత్రం కనిపించకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు బయలుదేరిన మహిళలు, కుటుంబాలు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
“పాఠశాలలకు సెలవులు ఉంటే గ్రామాలకు బస్సులు కూడా ఆపేస్తారా?” అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల రాకపోకలు తగ్గుతాయనే కారణంతో గ్రామీణ రూట్లలో బస్సులను తగ్గించడం లేదా నిలిపివేయడం సరైన విధానం కాదని వారు అంటున్నారు.
ఒకవైపు పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు ప్రకటిస్తుండగా, మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు సాధారణ బస్సులు కూడా అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. పండుగ రోజుల్లోనే గ్రామీణ ప్రజలకు రవాణా అవసరం మరింత పెరుగుతుందని, అలాంటి సమయంలో బస్సుల సంఖ్య పెంచాల్సింది పోయి సర్వీసులను నిలిపివేయడం బాధాకరమని మహిళలు పేర్కొన్నారు.
ప్రత్యేక బస్సులు ఎక్కడ?
పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ముందుగానే తెలిసినప్పటికీ తగిన రవాణా ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ రోజుల్లో గ్రామీణ రూట్లకు అదనపు బస్సులు కేటాయించి, ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతర సర్వీసులు అందించాలని వారు కోరుతున్నారు.
ఆర్టీసీ అధికారులు ప్రకటనలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించి, బస్సుల సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.



