*- హెమరేజిక్ షాక్, మూత్రపిండాల వైఫల్యం నుంచి మహిళను కాపాడిన అపోలో వైద్య నిపుణుల బృందం*
* 12 రోజుల పాటు ఐసీయూలో వెంటిలేటర్, డయాలసిస్ సాయంతో అత్యాధునిక చికిత్స
*మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అపోలో వైద్య బృందం
సాధారణ కాన్పు తర్వాత తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుని, అవయవాల వైఫల్యంతో కొట్టుమిట్టాడుతున్న 40 ఏళ్ల బాలింతకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు. ఈ మేరకు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ టి. జి. లక్ష్మి దుర్గ, సీనియర్ కన్సల్టెంట్,ఎమర్జెన్సీ & క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ యం.శ్రీనివాస్, నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఎ. కె. చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వల్లి ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి లు వివరాలు వెల్లడించారు. బాధితురాలు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం గర్భాశయ సంకోచ వైఫల్యం, గర్భాశయ ముఖద్వారంలో చీలికల కారణంగా తీవ్ర రక్తస్రావం (PPH) సంభవించిందని, రక్తపోటు పడిపోయి హెమరేజిక్ షాక్ మరియు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటిలేటర్‌పై అత్యంత విషమ స్థితిలో నెల్లూరు అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు.
అపోలోలో చేరే సమయానికి రోగి పరిస్థితి తీవ్రంగా విషమించి, తెల్ల రక్తకణాలు అధికమై, ప్లేట్‌లెట్లు 71,000కి పడిపోవడంతో పాటు రక్తం గడ్డకట్టే సామర్థ్యం పూర్తిగా దెబ్బతిని (DIC), తీవ్ర ఇన్ఫెక్షన్ మరియు మూత్రపిండాల వైఫల్యం (AKI)తో రోగి ప్రాణాలతో పోరాడుతున్నట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అపోలో మల్టీడిసిప్లినరీ బృందం రోగికి యుద్ధప్రాతిపదికన 4 యూనిట్ల ఎర్ర రక్తకణాలు, 8 యూనిట్ల ప్లాస్మా, 6 యూనిట్ల క్రయోప్రెసిపిటేట్‌తో భారీ రక్తమార్పిడి నిర్వహించింది. రక్తపోటును స్థిరీకరించడానికి అధునాతన మందులు, శ్వాసకోశ వైఫల్యానికి మెకానికల్ వెంటిలేటర్, మూత్రపిండాల రక్షణ కోసం పలుమార్లు డయాలసిస్ సెషన్లు నిర్వహించడంతో పాటు తీవ్ర ఇన్ఫెక్షన్ నివారణకు హై-ఎండ్ యాంటీబయాటిక్స్‌తో సుమారు 12 రోజుల పాటు ఐసీయూలో నిరంతర పర్యవేక్షణతో కూడిన చికిత్స అందించారు.
వైద్యుల నిరంతర కృషి, అపోలోలోని అత్యాధునిక మౌలిక వసతుల ఫలితంగా రోగి ఆరోగ్యం క్రమంగా కుదుటపడి, మూత్రపిండాల పనితీరు సాధారణ స్థితికి చేరుకోవడంతో వెంటిలేటర్ మరియు రక్తపోటు మందుల అవసరం లేకుండానే పూర్తిగా కోలుకున్నారు. అనంతరం మూడు రోజుల పాటు వార్డులో పర్యవేక్షించి, సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా డిశ్చార్జ్ చేశామని వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో సకాలంలో స్పందించడం, అత్యాధునిక బ్లడ్ బ్యాంక్, ఐసీయూ సదుపాయాలతో కూడిన సమగ్ర నిపుణుల బృందం అందుబాటులో ఉండటం వల్లే ఇలాంటి సంక్లిష్ట కేసుల్లో ప్రాణాలు కాపాడటం సాధ్యమైందని, నెల్లూరు ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించడంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని ఆసుపత్రి వైద్య బృందం ఈ సందర్భంగా పేర్కొంది.


