Friday, 25 September 2026

Tag: Nellore

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉత్తమ కవిగా పీర్ కుమార్

నెల్లూరులోని వేదాయపాలెంలో నివాసం ఉంటూ అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఉత్తమ కవిగా ఎంపికయ్యారు. ఇటీవల స్వర్గీయ గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్ లో నిర్వహించిన 24 గంటల ప్రత్యేక కవితా పోటీలో పాల్గొని టాప్ 25 లో విజేతగ నిలిచారు. జాతీయస్థాయిలో సుమారు 200మంది తమ కవితా ప్రతిభను వ్యక్త పరచగా 25 మందిని కమిటీ ఉత్తమ కవులుగా గుర్తించింది. అందులో పీర్ కుమార్ 20వ స్థానం సాధించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక టీం సభ్యులు, స్నేహితులు శ్రేయోభిలాషులు, సాహిత్య అభిమానులు, రచయితలు పీర్ కుమార్ ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం జి.వి.ఆర్.ఆర్ కళాశాల నెల్లూరు

జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో నేడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని *తెలుగు భాషా దినోత్సవాన్ని* ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షునిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ AB రవి కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు తెలుగు భాష మీద ఎక్కువ పట్టు సాధించాలని,తెలుగు కవులు,రచయిత్రులు పేర్లు తెలుసుకోవాలని, ఇతర భాషల పట్ల గౌరవం,మన భాషను నిత్యము సంభాషించడం,ఎంతో నేర్పు కలిగి ఉండాలని తెలియజేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె.వి సత్యనారాయణ గారు తెలుగు ఉపన్యాసకులు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నాయుడుపేట వారు మాట్లాడుతూ అభ్యుదయ కవి తెలుగు భాషా పండితులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జీవిత విషయాలని పిల్లలకు అర్థమయ్యేలా ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. తెలుగు భాష కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారిని స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. గిడుగు రామమూర్తి పంతులు గారు తెలుగు భాషా సంస్కరణోద్యమానికి గొప్ప కృషి చేశారు. అప్పట్లో పండితుల భాషగా ఉన్న గ్రాంథిక తెలుగును సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి ఆయన కృషి చేశారు. ప్రజలు మాట్లాడే వ్యావహారిక భాషలోనే విద్య, రచనలు ఉండాలని ఆయన బలంగా కోరారు. “.మరొక విశిష్ట అతిధి డికె ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల, నెల్లూరు జూనియర్ లెక్చరర్ తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ మర్రి వెంకట్రావు గారు మాట్లాడుతూ ప్రజల భాషే నిజమైన భాష” అనే భావనతో ఆయన తెలుగు భాషను ప్రజలకు మరింత దగ్గర చేశారు. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే భాషలో విద్య అందించడానికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు మనకు తెలుగు భాషను ప్రేమించాలి, గౌరవించాలి, మన దైనందిన జీవితంలో చక్కగా ఉపయోగించాలి అనే సందేశాన్ని ఇస్తుంది. మన మాతృభాష తెలుగు. తెలుగు మాట్లాడటం మన గౌరవం. తెలుగు చదవడం మన బాధ్యత. తెలుగును కాపాడటం మనందరి కర్తవ్యం. గిడుగు రామమూర్తి పంతులు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. జై తెలుగు! ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వరం ఆగినా… తరతరాల గుండెల్లో బాలు పాట ఆగదు

ఎస్పీ బాలసుబ్రమణ్యం వర్ధంతి సందర్భంగా.. గాన గంధర్వుడి స్వరం… తరతరాలకు మధుర స్మృతి తెలుగు సంగీత ప్రపంచంలో ఒక స్వరం వినిపిస్తే చాలు… ఆ స్వరం ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భావానికి ప్రాణం పోసే ఆ గాత్రం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్.పి.బి.)ది. భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాట మాత్రం ప్రతి ఇంటా మధుర జ్ఞాపకంగా మోగుతూనే ఉంది. కాలం మారినా ఆయన గాత్రంలోని మాధుర్యం చెక్కుచెదరలేదు. అందుకే బాలు కేవలం గాయకుడు కాదు… భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక చిరస్థాయి అధ్యాయం. ఇంజనీర్ కావాలనుకున్న బాలుడు… గాన గంధర్వుడైన బాలు 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించిన బాలసుబ్రహ్మణ్యానికి చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి. ఇంజనీర్ కావాలనుకున్న ఆయన జీవితం అనూహ్యంగా సంగీతం వైపు మలుపు తిరిగింది. 1966లో ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంతో సినీ గాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, ఆ తర్వాత దశాబ్దాల పాటు దక్షిణ భారతీయ సినీ సంగీతాన్ని ప్రభావితం చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం తదితర అనేక భాషల్లో వేలాది పాటలు పాడిన బాలు, తన బహుముఖ ప్రతిభతో అరుదైన గుర్తింపు పొందారు. గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. “విద్యకు వినయం అలంకారం” అన్న సామెతకు ఆయన వ్యక్తిత్వం చక్కని ఉదాహరణ. అవార్డులు ఎన్నో… అభిమాన హృదయాలే అసలైన పురస్కారం.. ఎస్.పి.బి. గాత్ర ప్రతిభకు అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. ఉత్తమ గాయకుడిగా ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులు కూడా అనేకసార్లు ఆయనను వరించాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. మరణానంతరం పద్మవిభూషణ్ గౌరవం లభించింది. వేలాది పాటలతో ఆయన సాధించిన ఘనతలు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోనూ నమోదయ్యాయి. పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. అయితే బాలు గారికి వచ్చిన అవార్డుల కంటే, ఆయన పాటలను తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలుగా దాచుకున్న కోట్లాది మంది అభిమానుల ప్రేమే గొప్ప గౌరవం. గొప్ప గాయకుడు… అంతకంటే గొప్ప మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకత. యువ గాయకులను ప్రోత్సహించడం, కొత్త ప్రతిభను గుర్తించడం, సహచర కళాకారులను ఆత్మీయంగా పలకరించడం ఆయన సహజ స్వభావం. టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వర్ధమాన గాయకులకు అవకాశాలు కల్పించి, వారి ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేశారు. తన స్థాయిని ఎప్పుడూ అహంకారానికి కారణంగా చేసుకోలేదు. “ఒదిగి ఉన్న కొమ్మకే పండ్లు ఎక్కువ” అన్న సామెత బాలు వ్యక్తిత్వానికి అచ్చంగా సరిపోతుంది. రికార్డింగ్‌ విషయంలో క్రమశిక్షణ, వృత్తిపట్ల అంకితభావం, నిర్మాతలు–దర్శకులు–సంగీత దర్శకుల పట్ల గౌరవం ఆయనకు సహజ లక్షణాలు. ఆయన మాటలో ఆత్మీయత, నవ్వులో బాల్యసౌమ్యం, ప్రవర్తనలో నిరాడంబరత కనిపించేవి. ఏ భావాన్నైనా పలికించిన గాత్రం బాలు గాత్రానికి ప్రత్యేకత ఒకటుంది. పాట ఏదైనా, భావం ఏదైనా… తన స్వరంతో దానికి జీవం పోయగలిగారు. ‘శంకరాభరణం’లోని శాస్త్రీయ సంగీత గంభీరత నుంచి ప్రేమగీతాల మాధుర్యం వరకు, విషాద గీతాల వేదన నుంచి ఉత్సాహభరితమైన మాస్ పాటల జోష్ వరకు ఆయన గాత్రం ఎన్నో రూపాలను సంతరించుకుంది. శాస్త్రీయ సంగీతానికి శ్రుతిశుద్ధి, ప్రేమగీతాలకు మాధుర్యం, విషాద గీతాలకు హృదయస్పర్శ, జానపద గీతాలకు సహజత్వం, మాస్ పాటలకు ఉత్సాహం… ఇలా పాట స్వభావాన్ని బట్టి తన స్వరాన్ని మలచడం ఆయన ప్రత్యేకత. అందుకే “పాటకు స్వరం ఉంటే… ఆ స్వరానికి భావం బాలు” అని చెప్పుకోవచ్చు. నటనలోనూ… డబ్బింగ్‌లోనూ తనదైన ముద్ర గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ బాలు తన ప్రతిభను చాటారు. సంగీత దర్శకుడిగా కూడా పలు చిత్రాలకు స్వరాలు అందించారు. ముఖ్యంగా డబ్బింగ్ కళాకారుడిగా ఆయన చేసిన సేవలు ప్రత్యేకమైనవి. కమల్ హాసన్ వంటి నటులకు ఆయన అందించిన డబ్బింగ్ అనేక చిత్రాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక నటుడి హావభావాలకు సరిపోయేలా స్వరాన్ని మార్చడం, పాత్ర స్వభావాన్ని గాత్రంలో ప్రతిబింబించడం ఆయన డబ్బింగ్ ప్రతిభకు నిదర్శనం. స్వరం ఆగింది… సంగీతం మాత్రం ఆగలేదు 2020 సెప్టెంబర్ 25న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మనకు దూరమయ్యారు. కానీ ఒక కళాకారుడి జీవితం శరీరంతో ముగియదు. అతను సృష్టించిన కళలో, అతని స్వరంలో, అతని అభిమానుల జ్ఞాపకాల్లో అతని ఉనికి కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ రేడియోలో ఆయన పాట వినిపించినా, టెలివిజన్‌లో ఆయన గానం కనిపించినా, పాత సినిమా తెరపై ఆయన స్వరం పలికినా… తరాలు దాటి వచ్చిన ఒక ఆత్మీయ అనుభూతి మనసును తాకుతుంది. “కాలం కరిగిపోతుంది… కానీ కళ నిలిచిపోతుంది.” బాలు గారి గానం అందుకు ప్రత్యక్ష నిదర్శనం. చిరస్థాయిగా నిలిచే గాన గంధర్వుడు : ఎస్.పి.బి. ఒక తరం గాయకుడు మాత్రమే కాదు; ఎన్నో తరాల భావోద్వేగాలకు స్వరమిచ్చిన గాన గంధర్వుడు. ఆయన పాటల్లో ప్రేమ ఉంది… భక్తి ఉంది… ఆనందం ఉంది… విషాదం ఉంది… జీవితం ఉంది. ఆయన స్వరం వినిపించిన ప్రతిసారీ ఒక జ్ఞాపకం మేల్కొంటుంది. ఒక పాట వినిపించిన ప్రతిసారీ ఒక తరం మన ముందుకొస్తుంది. బాలు భౌతికంగా దూరమైనా… ఆయన గానం మాత్రం మనకు ఎప్పటికీ దూరం కాదు. వర్ధంతి సందర్భంగా ఆ అపూర్వ గాన గంధర్వుడిని స్మరించుకుంటూ… శతకోటి ప్రణామాలు. వ్యాసరచన : బొల్లు రామమోహన్, రచయిత, పోరుమామిళ్ల.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అపోలో ఆసుపత్రిలో మహిళకు అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

అత్యంత సంక్లిష్టమైన వైద్య పరిస్థితులను అధిగమించి, కేవలం 700 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువును నెల్లూరు అపోలో స్పెషాలిటీ వైద్య బృందం విజయవంతంగా కాపాడింది. దీనిపై గురువారం అపోలో హాస్పిటల్ లో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ దుర్గ, అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి,డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు. సుమారు 25 వారాల గర్భంతో ఉన్న 28 ఏళ్ల మహిళ తీవ్రమైన నడుము నొప్పి, వాంతులు, ఉమ్మనీరు లీకేజ్ వంటి సమస్యలతో అపోలో హాస్పిటల్ లో చేరినట్లు వెల్లడించారు. అయితే ఆమె గర్భాశయం పుట్టుకతోనే రెండు భాగాలుగా ఉండే అరుదైన ‘‘ బైకార్నుయేట్ యుటెరస్ ’’ (Bicornuate Uterus) సమస్య ఉండటంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. పరిస్థితి విషమించడంతో తాము అత్యవసరంగా సిజేరియన్ (LSCS) శస్త్రచికిత్స నిర్వహించి కాన్పు చేసినట్లు వెల్లడించారు. ఈ కాన్పులో ఆడ శిశువు జన్మించగా, పుట్టిన సమయంలో చిన్నారి బరువు కేవలం 700 గ్రాములు మాత్రమే ఉంది. శిశువు బరువు చాలా తక్కువగా ఉండటంతో వెంటనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) లో ఉంచి ప్రత్యేక పర్యవేక్షణ, అధునాతన చికిత్స అందించామన్నారు. శస్త్రచికిత్స అనంతరం తల్లి కోలుకోగా, చిన్నారి కూడా సంపూర్ణ ఆరోగ్యంతో నిలకడ సాధించడంతో తల్లీ బిడ్డలను క్షేమంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. సంక్లిష్టమైన కేసును సమర్థవంతంగా నిర్వహించి చిన్నారికి ప్రాణం పోసినట్లు వెల్లడించారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో గైనకాలజీకి సంబంధించి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, హైరిస్క్ ఆపరేషన్లను కూడా విజయవంతంగా నిర్వహించే వైద్య బృందంతో పాటూ దానికి అనువైన అధునాతన వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయని డాక్టర్ లక్ష్మీ దుర్గ వెల్లడించారు. అపోలో వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

సాహితీ

‘పిడికిలి వదిలినప్పుడు’ కవితా సంపుటి ఆవిష్కరణ

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ రచించిన తాజా కవితా సంపుటి *‘పిడికిలి వదిలినప్పుడు’*ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ సాహిత్యం సమాజాన్ని చైతన్యపరిచే సాధనమని అన్నారు. సమాజంలో వస్తున్న మార్పులు, మానవ సంబంధాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను కవులు తమ రచనల్లో ప్రతిబింబించాలని పేర్కొన్నారు. మంచి సాహిత్యం పాఠకుల్లో ఆలోచనను రేకెత్తించడంతో పాటు మానవీయ విలువలను పెంపొందిస్తుందని తెలిపారు. డాక్టర్ పెరుగు రామకృష్ణ తన రచనల ద్వారా సామాజిక అంశాలను సున్నితంగా స్పృశిస్తున్నారని అభినందించారు. డాక్టర్ పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ ‘పిడికిలి వదిలినప్పుడు’లో మానవ సంబంధాలు, ప్రేమ, ఆత్మీయత, సామాజిక సమస్యలు, శ్రమజీవుల జీవితాలకు సంబంధించిన అంశాలను కవితలుగా మలిచినట్లు తెలిపారు. సాధారణ మనిషి జీవితంలో ఎదురయ్యే అనుభవాలను సరళమైన భాషలో పాఠకులకు చేరువ చేసే ప్రయత్నం చేశానన్నారు. తన కవితా సంపుటిని విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఉపకులపతి డాక్టర్ పెరుగు రామకృష్ణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి ఆచార్య మణికంఠ, సహాయక ఆచార్యులు చిన్నం రాజారాం, కుమ్మెత్తల లక్ష్మీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రూరల్‌లో ₹857 కోట్ల అభివృద్ధి: కోటంరెడ్డి

కూటమి ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.857 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ పరిధిలోని 36 డివిజన్లకు రూ.109 కోట్లు మంజూరయ్యాయని, వీటితో 625 అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలో నెల్లూరు నగర కార్పొరేషన్‌కు మరో రూ.300 కోట్ల నిధులు తీసుకురావడానికి మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆమంచర్లలో పారిశ్రామికవాడకు 500 ఎకరాలు, నరసింహకొండకు కేంద్ర నిధుల సాధనలో కలెక్టర్ హిమాన్షు శుక్లా సహకారం కీలకమన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

10వ డివిజన్‌లో ప్రజా సమస్యలు తెలుసుకున్న అడిషనల్ కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హిమబిందు శుక్రవారం 10వ డివిజన్ ఎన్‌డీఆర్ లేఅవుట్‌లోని అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులతో సమావేశమయ్యారు. డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్య సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హిమబిందు తెలిపారు. అధికారులు సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జ్ తిరుమల నాయుడు, శానిటరీ సూపర్‌వైజర్ షరీఫ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దోమల రహిత నెల్లూరే లక్ష్యం: నారాయణ

నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలో నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను తిరిగి ప్రారంభించామని, 2027 జూన్ 12 నాటికి వాటిని పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 13వ డివిజన్ యలమవారిదిన్నెలో ₹35 లక్షలతో పునర్నిర్మించిన స్వర్ణ వార్డు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అల్లీపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యువనేత నారా లోకేష్‌కు ఘనస్వాగతం

మంత్రి నారా లోకేష్‌కు నెల్లూరు రూరల్‌లో ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ముఖ్య నేతలతో సమావేశమై ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులతో రూరల్ ప్రాంతం జనసంద్రంగా మారేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకునే స్థాయిలో స్వాగత కార్యక్రమం నిర్వహించాలని కోరారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నారా లోకేష్‌కు భారీ స్వాగతం పలకనున్నట్లు నేతలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎస్ డెవలపర్స్‌లో క్రాస్ సెల్లింగ్‌పై గ్రూప్ డిస్కషన్

సీఎస్ డెవలపర్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అదనపు ఆదాయ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో క్రాస్ సెల్లింగ్‌పై గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. సమావేశంలో POSP మోడల్, వాహన బీమా, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, వాటి ద్వారా టీమ్ సభ్యులకు లభించే వ్యాపార అవకాశాలపై చర్చించారు. బ్రాంచ్ మేనేజర్ గంపాల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మొద్దు మహేష్, ఎంట్రపాటి వెంకయ్య, వినలరావు రామమోహన్‌రావు, కామటం జోజి, అరవ రవికిరణ్, వాసవి, జాహ్నవి, కాకుమాని కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్, క్రాస్ సెల్లింగ్ టీమ్ లీడర్లతో వ్యాపార విస్తరణ, కస్టమర్లకు సమగ్ర సేవలందించే విధానంపై చర్చించారు. కార్యక్రమానికి సహకరించిన సీఎస్ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బండ్ల చంద్రశేఖర్‌కు పున్నమి తరఫున ధన్యవాదాలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.