పొలంలోకి వెళ్లి ఆప్యాయంగా పలకరింపు.. వ్యవసాయ పనులపై ఆరా
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
కౌటాల, జూలై 31 (పున్నమి ప్రతినిధి):
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత శుక్రవారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన పొలంలో మహిళా కూలీలు వరి నాట్లు వేస్తుండటాన్ని గమనించిన కలెక్టర్ వాహనం దిగి వారిని కలిశారు.
గట్టుపై నిలబడి రైతు కూలీలను ఆప్యాయంగా పలకరిస్తూ.. ‘‘నాట్లు ఎలా సాగుతున్నాయి?’’ అంటూ వారి పని తీరును అడిగి తెలుసుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయని, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని మహిళా కూలీలు కలెక్టర్కు తెలిపారు.
వరి నాట్ల విధానం, జంబు కొట్టడం, వరి నారు కట్టలు తదితర అంశాలపై కలెక్టర్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కూలీలతో కొద్దిసేపు ముచ్చటిస్తూ వారి సమస్యలు, ఉపాధి పరిస్థితులపై ఆరా తీశారు.
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిత సూచించారు. నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు.
రైతు కూలీలతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడిన దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. అధికారిక కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి పరిస్థితులను తెలుసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.



