కోవూరు ఆగస్టు 29:
నెల్లూరు సమీపంలో ఉన్న కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం తెలుగు విభాగం ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత, ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర బాల సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ మరియు కళాశాల అధ్యాపక బృందం గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ వ్యవహారిక భాషాభివృద్ధికి స్వర్గీయ గిడుగు రామ్మూర్తి గారు చేసిన సేవలను గుర్తించుకొని ప్రతి ఒక్కరూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. అలాగే డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ తెలుగు గొప్పతనాన్ని చారిత్రాత్మకంగా సరళంగా వివరిస్తూ సులభమైన భాష, సౌలభ్యమైన భాష మన మాతృభాష తెలుగు అని, తెలుగు చక్కగా నేర్చుకుంటే ఏ భాషనైనా నేర్చుకోవచ్చని వివరించారు. అనంతరం తెలుగు భాష పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేసి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, తెలుగు అధ్యాపకులు మరియు నిర్వహకులు మోహన్ రావు, సాంస్కృతిక కార్యక్రమాలు కన్వీనర్ డాక్టర్ రమణరావు, ఆంగ్ల అధ్యాపకులు హరిప్రసాద్, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


