తరతరాల అనుబంధం – ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం
ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంట వివాహ వేడుకలు
స్వయంగా విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 22.( పున్నమి ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి, నారా కుటుంబాలతో కోళ్ల కుటుంబానికి ఉన్న అనుబంధం ఎనలేనిది. పార్టీ స్థాపన నాటి నుండి దివంగత మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు చూపిన నిబద్ధత, అందించిన సేవలు పార్టీ చరిత్రలో చిరస్మరణీయం. ఆనాటి నుండి మొదలైన ఈ ఆత్మీయ బంధం తరాలు మారుతున్నా మరింత పటిష్టంగా కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఎస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి, కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ల కుమార్తె చి.ల.సౌ. కోళ్ల అస్మితానాయుడు, వరుడు చి. చప్ప ఎర్ని పవన్ మౌళిల వివాహం ఈ నెల 27న వైభవంగా జరగనుంది. ఈ శుభకార్యాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్.కోటలోని ఎమ్మెల్యే స్వగృహానికి స్వయంగా విచ్చేశారు.
ఆత్మీయ పలకరింపులు – ఆశీర్వచనాల వర్షం
ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాబోయే నూతన వధూవరులను ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వర్గీయ కోళ్ల అప్పలనాయుడు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి రాకతో ఆ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం కోళ్ల అప్పలనాయుడు కుటుంబ సభ్యులందరితో కలిసి ముఖ్యమంత్రి చిరునవ్వుతో గ్రూప్ ఫోటో దిగారు. అధినేత స్వయంగా ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలపడం పట్ల ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.



