తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ ముగిసిన అనంతరం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్‌లోగా పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని సైబరాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన అచ్చంపేట, మందమర్రి, మణుగూరు, నకిరేకల్, కొత్తూరు, సిద్ధిపేట ప్రాంతాల్లోనూ డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో ఆశావహులు, రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసే అవకాశం ఉంది.




