ఏటీఎం లేక అవస్థలు
ముద్దనూరు పట్టణంలోని కెనరా బ్యాంక్ ఏటీఎం గత పది నెలలుగా దా పనిచేయడం లేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముద్దనూరుతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఈ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉ న్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళా సంఘాల లావాదేవీలు ఎక్కువగా ఉండటంతో ఏటీఎం మూతపడటం వారికి పెద్ద సమస్యగా మారింది. నగదు అవసరానికి ఇతర బ్యాంకుల ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ఖాతాదారులు అదనపు ప్రయాణ ఖర్చులు, సమయం వృథా అవుతోందని వాపోతున్నారు. సమస్యను పలుమార్లు బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సేవలు అందకపోయినా బ్యాంకింగ్, ఏటీఎం సర్వీస్ ఛార్జీలు మాత్రం వసూలు చేస్తున్నారని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. ఏటీఎం మూతపడటానికి గల కారణాలు వెల్లడించి, సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

