ఖమ్మం: భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, వాటి పరిష్కారానికి రైతుల ఐక్యత ఆవశ్యకతపై విస్తృతంగా చర్చించారు. భారతీయ కిసాన్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ పగడవరపు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి శ్రీనివాస్ రావు, జిల్లా కార్యదర్శి శ్రీ తూము అప్పారావు, జిల్లా కోశాధ్యక్షుడు శ్రీ నరేష్ పాల్గొన్నారు.
రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ముందుగా రైతులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని సమావేశంలో పేర్కొన్నారు. గ్రామ గ్రామాన రైతులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ, రైతులుగా మాత్రం ఒక్కటై తమ సమస్యలను గుర్తించి, వాటిని సమిష్టిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రైతుల సమస్యల విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
రైతుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని నాయకులు తెలిపారు. ప్రతి గ్రామంలో రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా రైతులను సంఘటితం చేయడమే భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల ఐక్యతతోనే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.


