భూపాలపల్లి, ఆగస్టు 30: ప్రజల సమస్యలను తెలుసుకుని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చూపుతున్న మార్గంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య ముందుకు సాగుతున్నారు.
భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు దుర్గం రవి కుమారుడు వైష్ణవ తేజ్‌కు లింఫాడెనైటిస్ అబ్సెస్ (Lymphadenitis Abscess) శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, స్థానిక కౌన్సిలర్లతో కలిసి రవి నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా వైష్ణవ తేజ్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందించేందుకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రజలకు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటూ, వారి కష్టాల్లో భాగస్వాములై అండగా నిలవడమే తమ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చూపిస్తున్న ప్రజాసేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని పట్టణ ప్రజలకు నిరంతరం సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


