నెల్లూరు (కలెక్టరేట్): వంటింటి గ్యాస్ నల్లబజారుకు తరలుతోంది. అవసరాలను బట్టి గృహ వినియోగ సిలిండరు బయట మార్కెట్లో రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. నియంత్రణకు చమురు, ఇంధన ఉత్పత్తి సంస్థలు గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల పూర్తి వివరాలు సేకరించడంతో పాటు వారిలో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీ తప్పనిసరి చేశాయి. ఈ ప్రక్రియను ఈనెల 31 లోగా పూర్తి చేయించుకోవాలని మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపుతున్నారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోకుంటే గ్యాస్ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపేస్తామని లేదా రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
యాప్ల ద్వారా..జిల్లాలోని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరకుండా అన్ని సంస్థలు తమ యాప్ల ద్వారా ఈ ప్రక్రియను ఎవరికి వారే స్వయంగా పూర్తి చేసుకునే అవకాశం కల్పించాయి. యాప్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈకేవైసీ ఆప్షన్లోకి వెళ్లి ముఖ గుర్తింపు ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాలనుకునే వారు రిజిస్టర్ మొబైల్, ఆధార్కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ అనుసంధానం ఉంటే ముఖ గుర్తింపు లేదా వేలిముద్ర ద్వారా పూర్తి చేసుకోవచ్చు.85శాతం పూర్తి
జిల్లా వ్యాప్తంగా 8,41,784 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
వీటిలో దీపం 2,33,398, డొమెస్టిక్ 4,83,859, సీఎస్ఆర్ 1,00,208, ఉజ్వల 24,319 కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 45 వేల సిలిండర్లు నిరంతరం సరఫరా చేస్తున్నారు.
గ్యాస్ వినియోగదారుల నుంచి ఈకేవైసీ వివరాల సేకరణ 85 శాతం పూర్తి చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వరకే గడువు ఇచ్చినా అప్పటికీ వివరాల సేకరణ పూర్తి కాకపోవడంతో ఈ 31 వరకు గడువు పెంచారు.


