
విశాఖపట్నం,జూన్6(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్):విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గత 41 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం, జిల్లాలో ఇతర గ్రంధాలయాల్లో నిర్వహిస్తున్న శిబిరాలు శనివారం ఘనంగా ముగిశాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిధి గా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు పాల్గొన్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బసు పోతన, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు పి. ప్రభాకర్ రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ రూప తదితరులు పాల్గొని విద్యార్థిని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పిల్లలే రేపటి ఆశాకిరణాలని, సమయ పాలన, క్రమశిక్షణను అలవర్చుకుంటూ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులను వక్తలు అభినందించారు. పుస్తక పఠనం ద్వారానే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని, ఇటువంటి శిబిరాలు పిల్లల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీస్తాయని పేర్కొన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వమే విజేతలుగా నిలుపుతుందని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరాలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. అలాగే జిల్లాలోని శాఖా గ్రంథాలయాలలో వేసవి విజ్ఞాన శిబిరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించిన నర్సీపట్నం, చోడవరం, గాజువాక, డంబ్రిగుడ, రోలుగుంట గ్రంథాలయాధికారులు పి.దమయంతి, ఎం ఎస్ ఎల్ జోగేశ్వరి, బి సూర్యకళ, శెట్టి సునీత, ఎన్ రాజబాబు లను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజు ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. ముగింపు వేడుకల్లో వివిధ శాఖల గ్రంథ పాలకులు , గ్రంథాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

