హైదరాబాద్ నుంచి ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక టూరిజం ప్యాకేజీ రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫారెస్ట్, ఐటీడీఏ, టూరిజం శాఖల ఆధ్వర్యంలో రూపొందిస్తున్న ఈ ప్యాకేజీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రూ.39 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. వెలుగుమట్ల, ఖిల్లా పులిగుండాల, కిన్నెరసాని, భద్రాచలం, బోగత జలపాతం, లక్నవరం, రామప్ప తదితర పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేయనున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ఒక రోజు నుంచి ఐదు రోజుల వరకు విభిన్న ప్యాకేజీలను రూపొందించినట్లు సమాచారం. అటవీ అందాలు, జలపాతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను ఒకే టూర్‌లో చూసే అవకాశం కల్పించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.



