

విశాఖపట్నం మే19(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్):విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ, సేవాభావం అలవరుచు కోవాలని ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం శివారు గోపాలపట్నంలో బాలాజీ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంపును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో స్కౌట్స్ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు మెరుగు పడతాయని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం, సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. బాలాజీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు, స్కౌట్ మాస్టర్లు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

