తిరుపతి, ఆగష్టు 17, పున్నమి ప్రతినిధి
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని శెట్టిపల్లిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం భూములు తీసుకుని, సంబంధిత లబ్ధిదారులకు వారి వాటా భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మంజూరు చేయకుండా జాప్యం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు. గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం భూ బాధితులతో కలిసి ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే సుమారు 40 సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇతర రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికే పీజీఆర్ఎస్ వేదికను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అయితే ఒకే భూ సమస్యపై 40 సార్లు అర్జీలు సమర్పించినా పరిష్కారం కాకపోవడం పీజీఆర్ఎస్ పనితీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందన్నారు. ప్రజలు పదే పదే అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, ఒకసారి అర్జీ అందిన వెంటనే సమస్యను పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
సుబ్బమ్మ, గురునాథం, లక్ష్మయ్య, గురవ తదితరులకు సంబంధించిన భూముల విషయంలో 2019 ఫిబ్రవరి 15న తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ వెంకటరమణ అర్హులుగా గుర్తించి, వారికి ప్రొసీడింగ్స్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కు సిఫారసు చేసినట్లు తెలిపారు. జీవో నంబర్ 173 ప్రకారం అర్హులైన అనుభవదారులకు ప్రొసీడింగ్స్ జారీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఇంతకాలం గడిచినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
జిల్లా స్థాయి అధికారి ఒకరు కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని చెబుతుండగా, డివిజన్ స్థాయి అధికారి మాత్రం కోర్టును ఆశ్రయించి పరిష్కరించుకోవాలని సూచించడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో సిపిఎం పార్టీని ఆశ్రయించారని నాగరాజు తెలిపారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యను పరిష్కరించకుండా మరింత జాప్యం చేస్తే భూ బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి, భారీ ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసరి జనార్ధన్, సిపిఎం నగర కార్యదర్శి కే. వేణుగోపాల్, భూ బాధితులు పాల్గొన్నారు.


