ఖమ్మం మే
(పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి )
ఖమ్మం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్‌పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వివాహిత మహిళను ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేస్తానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడని బాధితురాలు ఆరోపించింది. గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా, ట్యాబ్లెట్లు మింగించి అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి వివరాల ప్రకారం, 2023లో భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో అప్పట్లో అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ రాజు నాయక్ పరిచయం అయ్యాడు. న్యాయం చేస్తానంటూ ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడినట్లు తెలుస్తోంది.
తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నాడని, గర్భవతి అయిన తర్వాత మాత్రం పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో ఈ నెల 7వ తేదీన ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
విషయం బయటకు రావడంతో సీఐ రాజు నాయక్ అందుబాటులో లేకపోయినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో ఆయనను తెలంగాణ పోలీస్ డిజిపి కార్యాలయం కి అటాచ్ చేసినట్లు తెలిపింది.



