చంద్రబాబు నాయుడిపై అసత్య ప్రచారాలు చేసి జైలుకు పంపిన వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలకు ధర్మాసనం తీర్పుతో చెక్ పడిందని, అసత్యంపై సత్యం గెలిచి మూడేళ్లు పూర్తయ్యాయని టీడీపీ ఒంటిమిట్ట జడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి అన్నారు.రాజంపేట పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిపై ఎలాంటి మచ్చలేదని, తెలుగు రాష్ట్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన ఆయనను అప్పటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో జైలుకు పంపిందని ఆరోపించారు. అయితే అసత్యం ఎక్కువ కాలం నిలబడలేదని, చివరకు సత్యమే గెలిచిందని పేర్కొన్నారు.చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించారని తెలిపారు. ప్రజల ఆగ్రహానికి 2024 ఎన్నికల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకుందని అన్నారు. అయినప్పటికీ వైసీపీ నేతల తీరు మారలేదని, వివిధ అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.కక్షపూరిత రాజకీయాలకు పాల్పడితే ప్రజల నుంచి ఎలాంటి గుణపాఠం ఎదురవుతుందో తెలియజేసేందుకే టీడీపీ ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. కక్ష సాధింపు రాజకీయాలకు బదులుగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.వైసీపీ నేతలు ఇకనైనా అసత్య ప్రచారాలను విడనాడి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తే ప్రజలు క్షమించే అవకాశం ఉందని అన్నారు. లేనిపక్షంలో ప్రజలే మరోసారి తగిన గుణపాఠం చెబుతారని ముద్దుకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అద్దలూరు ముద్దుకృష్ణ రెడ్డి, ఎంపీటీసీ సుంకేసుల భాష, ఎంపీపీ ప్రతినిధి సాలాబాద్ బుజ్జి, చంద్రమౌళి, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


