విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడితే సహించేది లేదు: ఎమ్మెల్యే నల్లమిల్లి
కుళ్లిన కూరగాయలు, ఉడకని అన్నం, మాగిన అరటిపండ్లపై ఆగ్రహం
అనపర్తి, సెప్టెంబరు 3: విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడితే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలుర)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలోని వసతిగృహం, భోజనశాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. అన్నం సరిగ్గా ఉడకకపోవడం, కూర నాణ్యతగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు తినలేక భోజనాన్ని డస్ట్‌బిన్లలో పడేస్తున్న పరిస్థితిని గమనించారు.
భోజనశాలలో నిల్వ ఉంచిన కూరగాయలను పరిశీలించగా కుళ్లిపోయిన వంకాయలు, నీరు కారుతున్న ఉల్లిపాయలు, ముదిరిపోయిన ఆనపకాయలు, బెండకాయలు, పుచ్చిపోయిన టమోటాలు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి కూరగాయలను విద్యార్థులకు ఎలా వినియోగిస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. పెరుగు పేరుతో అందిస్తున్న పదార్థం కూడా నాణ్యతగా లేదని, నీటిలా ఉందని పేర్కొన్నారు. మెత్తబడి నీరు కారుతున్న చిక్కీలు, పురుగులు ఉన్నట్లు కనిపించిన స్నాక్స్, మాగిపోయిన అరటిపండ్లను కూడా తనిఖీలో గుర్తించినట్లు తెలిపారు.
మెనూ అమలుపై ఆగ్రహం
ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పాఠశాలలో సక్రమంగా అమలు చేయడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. అల్పాహారం, స్నాక్స్, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో మెనూ పాటించడం లేదన్నారు. ఆదివారం అందించాల్సిన చికెన్ భోజనం కూడా విద్యార్థులకు అందడం లేదని తెలిపారు.
రాత్రి భోజనానికి సంబంధించిన అన్నం, పప్పును ఉదయం 10 గంటలకే వండి ఉంచడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. సాయంత్రం వరకు ఆహారం నాణ్యత ఎలా ఉంటుందనే కనీస ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాత్రి మెనూలో చిక్కుడుకాయ కూర ఉండాల్సి ఉండగా బొబ్బర్లను కట్ చేసి పెట్టిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
స్టాక్ రిజిస్టర్ నిర్వహణపై ప్రశ్నలు
కూరగాయలు, ఇతర సరుకుల వివరాలను నమోదు చేసే స్టాక్ రిజిస్టర్ ఎక్కడ ఉందని కేర్‌టేకర్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. తొలుత వెరిఫికేషన్ కోసం సోషల్ వెల్ఫేర్ కార్యాలయానికి పంపించామని చెప్పి, అనంతరం తన ఇంటి వద్ద ఉందని సమాధానం చెప్పినట్లు తెలిపారు. పాఠశాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్‌ను కాకినాడలోని వ్యక్తిగత ఇంటి వద్ద ఉంచడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రతిరోజూ వచ్చే సరుకులను మెస్ కమిటీ సభ్యులు పరిశీలించే విధానం కూడా సక్రమంగా లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అవసరమైన చోట మాత్రమే వారి సంతకాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పాఠశాల నిర్వహణలో ప్రిన్సిపల్, కేర్‌టేకర్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెలవులో ఉండటంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా
పాఠశాలలో నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం, సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు.
తనిఖీ సందర్భంగా విద్యార్థులు తెలిపిన ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు అందుబాటులో ఉంటే వాటితో, లేకుంటే సీఎస్‌ఆర్ నిధుల ద్వారా అవసరమైన పనులు చేపడతామన్నారు. విద్యార్థులు కోరిన ఫ్యాన్లు, టైల్స్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గురుకులంలో భోజన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు స్టాక్ నిర్వహణ, పరిశుభ్రత, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి స్పష్టం చేశారు.







