ఖమ్మం రైల్వే స్టేషన్ కూడలి నిత్యం రద్దీతో కిక్కిరిసిపోతోంది. ఒకవైపు రైల్వే స్టేషన్, మరోవైపు మహిళా పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లు ఉండటంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. అయితే కూడలిలో ఆటోలు రోడ్డుపైనే అడ్డాగా మార్చుకోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంటోంది. ఆటోలను రోడ్డుపైనే నిలిపివేయడంతో పాటు ట్రాఫిక్ ఐలాండ్‌ను కూడా ఆటో డ్రైవర్లు వినియోగించుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన కూడలిలో కనీసం ఒక్క ట్రాఫిక్ పోలీసును కూడా విధుల్లో ఉంచకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు స్పందించి ఆటోలకు ప్రత్యేక పార్కింగ్/స్టాండ్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.



