– గ్రామీణులకు అందుబాటులోకి ప్రభుత్వ సేవలు
– రూ.68 లక్షలతో కార్యాలయం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు
– ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం సి.కందులవారిపల్లిలో స్వర్ణ గ్రామ కార్యాలయం, గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బాలు రామాంజులు నాయుడు ఆధ్వర్యంలో సుమారు రూ.68 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలను ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకుడు కస్తూరి విశ్వనాథ నాయుడు, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ కె.కె. చౌదరి, పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్తూరి విశ్వనాథ నాయుడు మాట్లాడుతూ గ్రామంలోనే ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించడంతోపాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు స్వర్ణ గ్రామ వ్యవస్థ కీలకమన్నారు. ఈ సదుపాయాలను మంజూరు చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్వర్ణ గ్రామ, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.


