శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రావణమాసంలో అన్ని విశేషాలే. అత్యంత భక్తి భావంతో, ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు .ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి తో పాటు మరో విశేషం కూడా ఉంది .ఈ మాసంలోనే శ్రీకృష్ణుని జయంతి. తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినం శ్రీ కృష్ణాష్టమి. దీనినే కృష్ణ జన్మాష్టమి అని, గోకులాష్టమి అని శ్రీకృష్ణ జయంతి అని కూడా అంటారు. అని అందరూ విశేషంగా జరుపుకుంటారు.
హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే శ్రావణ బహుళ అష్టమి తిథి రోజున దేశవ్యాప్తంగా హిందువులు పెద్ద ఎత్తున శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు జగద్గురువు. గీతను బోధించి లోకానికి దారి చూపుతాడు. శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు. తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్ధాన్ని చెప్తాడు. వెన్నదొంగగా అందరి మనసులను దోచుకున్నాడు. గోపబాలుడిగా, సోదరునిగా అసురసంహారిగా ,ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించారు. ఎన్ని రకాల పాత్రలు పోషించిన అదంతా లోక కళ్యాణం కోసమే.
శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించిన రోజు శ్రీ కృష్ణాష్టమి. ఆరోజు ప్రతి ఇంట్లో తల్లులందరు తమని తాము దేవికి యశోదలుగా భావించుకుంటూ తమ పిల్లలని శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావించి, వేడుకలు జరుపుకుంటారు. ఆరోజు ఎవరైతే శ్రీకృష్ణుడిని అత్యంత భక్తి సంతానలేమితో బాధపడేవారు ఈరోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలో నూ పుడతారని విశ్వసిస్తారు.
పురాణాల ప్రకారం లోక సంరక్షణ అర్థం పాపులను సంహరించడానికి విష్ణుమూర్తి అనేక పద్ధతులను అవలంబించారు. అయితే విష్ణుమూర్తి దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం. ప్రజలను ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి కంసుడిని వధించడం కోసం విష్ణువు శ్రీకృష్ణ అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని గురించిన ప్రస్తావన బ్రహ్మాండ పురాణం, స్కాంధ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం లలో కనిపిస్తుంది. పూర్వం నారద మహర్షి ఒకసారి సత్య లోకమునకు చేరుకొని, బ్రహ్మదేవుడిని దర్శించి, స్వామి నామీద దయవుంచి శ్రీ కృష్ణాష్టమి మహత్యం గురించి వివరించండి అని కోరాడట. నారద …..శ్రీకృష్ణుడు జన్మించిన రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఈనాడు శ్రీకృష్ణుని పేరు స్మరించినందునే జన్మజన్మల పాపాలన్ని పటాపంచలు అవుతాయి. అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. శిశుపాలుడు వంటి వారు ఈ వ్రతాన్ని ఆచరించి, గొప్పవారయ్యారు. ఎందరో మహామణులు ఈ వ్రతాన్ని ఆచరించి మరణాంతరం విష్ణు లోకమునను పొందారు. ఈ వ్రతాచరణ వల్ల సకలభయాలు తొలగిపోయి, వ్యాధులన్నీ నయమై ,సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు,ఇంకా ఆయువృద్ది చెందడంతో పాటు విద్యా, విజ్ఞానం వృద్ధి చెందుతాయి, అని బ్రహ్మదేవుడు వివరించాడు. ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడి వద్ద నుండి శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని తెలుసుకున్న త్రిలోకసంచారి అయినా నారద మహర్షి ,సకల లోకము లకు దీనిని గురించి వివరించడంతో ఆచరణలోకి వచ్చినట్లు పురాణ కథనం.
ఈ వ్రతాచరణ లో భాగంగా కృష్ణాష్టమి రోజున ఉదయం ఇంటిని శుభ్రపరచుకొని కన్నయ్యకు ప్రత్యేకంగా అలంకరణలు చేసి ఈ పండుగను జరుపుకుంటారు. కృష్ణుడి అడుగులు వేస్తారు. కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు. మొదటి ఆరాధనలో సూర్యోదయానికి ముందుగానే ఉపవాసంలో కృష్ణుడిని ఆరాధిస్తారు. రెండవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు చేస్తారు.ఈ సమయంలో ముందుగా కన్నయ్య తల్లి దేవకికి నీటిని అర్పించి పూజించిన తర్వాత కన్నయ్యను పూజిస్తారు. మూడవ ఆరాధన కృష్ణుడికి ఎంతో పవిత్రమైనది . అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు .ఈ విధంగా అర్ధరాత్రి కృష్ణుడిని పూజించడానికి గల కారణమేమిటి అనే విషయానికి వస్తే….. శ్రీకృష్ణుడు జన్మించినది అర్ధరాత్రి కనుక అర్థరాత్రి సమయంలో పెద్ద ఎత్తున పూజలు చేసి భక్తులు ఉపవాస దీక్షను వదులుతారు. ఈ విధంగా వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి, శ్రీకృష్ణ సహస్రనామాలను బాలకృష్ణ స్తోత్రం చదువుతూ శ్రీకృష్ణ లీలలు వింటూ, భక్తులు జాగరణ చేసి కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు .
ప్రపంచాన్ని దుష్ట సంహారం చేస్తున్నటువంటి కంసుని వధించడానికి ఉద్భవించిన రూపమే కృష్ణ అవతారం .
కంసుడు భాగవత పురాణంలోని ఒక పాత్ర. మధురలో రాజధానిగా ఉన్న వృష్టి రాజ్యానికి నిరంకుశ పాలకుడు. ఇతని తల్లిదండ్రులు ఉగ్రసేనుడు పద్మావతి కంసుడుపూర్వజన్మలో కాలనేమి అను రాక్షసుడు, కనుక ఈ జన్మ నందు ఆ పాపం తప్పక దేవతలకు విరోధి అయి అనేక రాక్షసులను తోడు చేసుకొని సాధువుల ను బాధిస్తుండేవాడు .
కంసుడు పరమ రాక్షసుడు అయినప్పటికీ అతనికి చెల్లెలు దేవకి అంటే అమితమైన ప్రేమ. ఆమెకు వసుదేవుడిని ఇచ్చి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి సాగనంపుతున్న సమయంలో, ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానం గా, పుట్టే కుమారుడు కంసుని సంహరిస్తాడని చెబుతుంది. దీంతో కోపోద్రిక్తుడైన కంసుడు తన చెల్లెలు దేవకి, బావ వసుదేవులను చేరసాలలో బంధి లను చేస్తారు .వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే సంహరిస్తుంటాడు.
ప్రపంచాన్ని దుష్టుడైన కంసుడి నుండి విముక్తి చేయడానికి తాను దేవికి, వసుదేవుల ఎనిమిదవ సంతానం కృష్ణుడి రూపంలో జన్మిస్తానని విష్ణుమూర్తి స్వయంగా వసుదేవుడికి చెప్పాడు. విష్ణుమూర్తి కృష్ణావతారంలో జన్మించిన తర్వాత తనని గోకులంలోని తన స్నేహితుడు, గోసంరక్షకుడైన నంద ఇంటికి తీసుకెళ్లాలని కూడా విష్ణుమూర్తి వసుదేవుడికి చెప్పారు .ఏడవ బిడ్డా చనిపోయాడని తెలుసుకున్న కంస మహారాజు చాలా సంతోషించాడు. ఇప్పుడు ఎనిమిదవ బిడ్డ పుట్టాలని ఎదురుచూస్తున్నాడు. తదుపరి బిడ్డ తన సంహారకుడని తనకు తెలుసు. దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానం కలగబోతుందని తెలుసుకున్న కంసుడు వారి బందిని పటిష్టం చేస్తాడు. మరియు కాపలాదారులని రెట్టింపు చేస్తాడు. రాత్రి దేవకికి ఎనిమిదో బిడ్డ పుట్టే వరకు అంతా కంసుడి ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కానీ తర్వాత విష్ణు ఊహించినట్టుగా కృష్ణుడు 8వ సంతానంగా దేవకి, వసుదేవులకి జన్మిస్తాడు. వసుదేవుడు కృష్ణ కృష్ణున్ని గోకులంలోని నంద ఇంటి దగ్గర తీసుకెళ్లి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు.
విష్ణువు యొక్క మాయ శక్తితో వసుదేవుని పట్టుకున్న భారీ గొలుసు వెంటనే జారిపోతాయి. వసుదేవుడు మరియు దేవకి ఉన్న చెరసాల బయట కాపలాదారులు గాడ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు చిన్ని కృష్ణుడితో నందుడి ఇంటికి బయలుదేరుతాడు. ఆ రాత్రి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వసుదేవుడు మార్గమధ్యంలో యమునా నది ని దాటవలసి వచ్చింది. నెమ్మదిగా వసుదేవుడు శ్రీకృష్ణదే వ శ్రీకృష్ణుడి తో పాటు నది ని దాటడానికి నీటిలో దిగుతాడు .నెమ్మదిగా నడవడం ప్రారంభిస్తాడు. నీరు మోకాళ్ల వరకు వచ్చాయి .కానీ వసుదేవుడు అలాగే వెళ్ళసాగాడు. ఆ తర్వాత మీరు నడుము వరకు చేరింది. కానీ అతను ఇంకా తన ప్రయాణం ను కొనసాగిస్తూనే ఉంటాడు. వసుదేవుడు చిన్నారి కృష్ణుని తలపై పెట్టుకుని ముందుకు సాగిపోయాడు. నీరు వసుదేవుడు నోటి వరకు వచ్చింది .అయినా అతని ప్రయాణం ఆపలేదు. వసదేవుని సంకల్పం ,మరియు విష్ణుమూర్తి పట్ల ఉన్న ప్రేమకు సంతోషించిన శిశువు కృష్ణుడు బుట్టలో నుండి తన పాదాన్ని బయటకు తీసి యమునా తీరాన్ని తాకుతాడు. కృష్ణుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి స్వయం స్పర్శతో ఆశీర్వదించబడిన యమునా నది, వసుదేవుడు నడవడానికి మార్గాన్ని కూడా ఏర్పరిచింది.
వసుదేవుడు గోకులంలోని నందుని ఇంటికి వచ్చేసరికి నిజంగా అర్ధరాత్రి అయింది. నంద తప్ప గ్రామంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అదే రాత్రి నంద భార్య యశోద ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. వసుదేవుడు త్వరగా కృష్ణుడిని యశోద పక్కన ఉంచి తన ఎనిమిదవ బిడ్డగా ఆ చిన్నారిని తీసుకున్న వసుదేవుడు తిరిగి కారాగారం చేరుకున్నాడు. తిరిగి యధా విధంగా వసుదేవుడి చేతులు గొలుసులతో కట్టబడ్డాయి. కాపలాదారులు నిద్ర నుండి మేల్కొన్నారు. నవజాత శిశువు ను చూడగానే కాపలాదారులు కంసుడికి సమాచారం అందించారు.కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత చివరకు తనను చంపాల్సిన బిడ్డను చంపగలను అని కంస మహారాజు సంతోషంతో చెరసాల దగ్గరికి చేరుకున్నాడు. దేవకి ఆడపిల్లకి జన్మనిచ్చింది,అన్న వార్తను తెలుసుకున్న కంసుడు కాస్త ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఎనిమిదవ సంతానం మగపిల్లాడు పుడతాడని ఆకాశవాణి చెప్పింది. అయినా ఆ పాపను చంపాలని నిర్ణయించుకుంటాడు. ఆడపిల్ల వల్ల తనకు ఏ అపాయం రాదని వదిలివేయమని దేవికి అన్నను బతిమాలిన వినకుండా ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ శిశువు కంసుని పట్టనుండి మాయమై తన నిజమైన రూపం, దుర్గాదేవిగా రూపాంతరం చెంది, పైకి ఎగసి….. నిన్ను చంపేవాడు పుట్టాడు,రేపల్లెలో పెరుగుతున్నాడు, అని చెప్పి మాయమైపోతుంది.
నందుని ఇంట మరో మగ బిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తాడు నందుడు. ఆ వేడుక నే గోకులాష్టమి గా ప్రసిద్ధికేక్కింది. కృష్ణుడు తన 16వ సంవత్సరం న కంసుని సంహరించడం జరుగుతుంది.
శ్రీకృష్ణుడు ఎనిమిది మంది రాఅణులను, 16,000 మంది గోపికలను, వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే దీనిపై భిన్నమైన కథనాలు ఉన్నాయి. మహాభారతం భాగవత పురాణం శ్రీకృష్ణుడికి అష్టభార్యలు ఉన్నారంటే, విష్ణు పురాణం 9 మందిని తెలిపింది. హరివంశ పురాణం సప్త భార్యలను వివాహమాడినట్టు పేర్కొంది .
ఇక కృష్ణాష్టమి రోజున జరిగే వుట్టి కార్యక్రమంలో బాలకృష్ణుని చిలిపి చేష్టలను తలుచుకుంటూ , పాలు, పెరుగు ,వెన్న ,అటుకులు, పళ్ళు లాంటి పదార్థాలు ఉంచిన ఉట్టిని కొడతారు. మరికొందరు హోలీ తరహాలో గులాలు చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణని ప్రతిమను మనసారా అలంకరించి ఉయ్యాలలో ఉంచి , రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు.
భూమి మీద అధర్మం, అరాచకత్వం పెరిగిపోయి ధర్మం కానరానప్పుడు విష్ణుమూర్తి మానవ అవతారంలో జన్మించి అసురసంహారం జరిపించి తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతాడని విశ్వాసం.
శ్రీకృష్ణ అవతారం ఇచ్చిన అద్భుతమైన సందేశం ధర్మాన్ని రక్షించడానికి, మానవాళిని సంరక్షించడానికి, విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే కృష్ణావతారం. బాలకృష్ణుడిగా అల్లరి పనులు చేసిన , వెన్నదొంగగా మారి తల్లుల మనసు దోచిన కన్నయ్య ఎంత చేసిన అల్లరి మనసుకు సంతోషం కలిగిస్తుంది. గోవర్ధనగిరి దారిగా, ఖాళీయ మర్దనుడిగా, గోపికా లోలిడిగా , అసురసంహారిగా ,గీతా ప్రబోధకుడిగా, కృష్ణుడు ప్రపంచానికి, ఇచ్చిన అద్భుతమైన సందేశం మనలను నడిపిస్తుంది. మరి అలాంటి నల్లనయ్యకు, కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి తరిద్దాం. ఈ గోపికలోలుడు గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే .ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.


