జర్నలిస్టుల సంక్షేమానికి కొత్త దిశ.. రాష్ట్ర స్థాయిలో గంగాధర్ యాదవ్‌కు కీలక బాధ్యతలు
రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం
హక్కుల పరిరక్షణ.. సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందించాలని రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాసులు పిలుపు
వేముల జూలై 20 : సూర్య న్యూస్
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తి గౌరవం కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలనే లక్ష్యంతో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్జేడబ్ల్యూఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెల్లుబోయిన గంగాధర్ యాదవ్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవస్థాపకులు కె. శ్రీనివాసులు సోమవారం కడప జిల్లా కేంద్రంలో నియామక పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేసే నాయకత్వాన్ని గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కె. శ్రీనివాసులు మాట్లాడుతూ మీడియా రంగంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన, ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ యాదవ్ సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించడంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో కమిటీలను బలోపేతం చేసి సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సూచించారు. అలాగే జర్నలిస్టులపై జరిగే వేధింపులు, అక్రమ కేసులు, వృత్తి సంబంధిత సమస్యలపై సంఘం తరఫున ముందుండి పోరాడాలని, యువ జర్నలిస్టులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.
నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ యాదవ్ మాట్లాడుతూ సంఘం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని, రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు సంఘం అండగా నిలిచేలా కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, సభ్యత్వ బలోపేతం, సంఘ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సమష్టిగా పనిచేస్తానని చెప్పారు.
అనంతరం గంగాధర్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాసులను దుశాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిగా శ్రీనివాసులు కూడా గంగాధర్ యాదవ్‌ను దుశాలువాతో సన్మానించి నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొని గంగాధర్ యాదవ్ నియామకాన్ని హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఆయన నాయకత్వంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతమై, జర్నలిస్టుల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


