ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసనగా నిర్మల్లో బీఆర్ఎస్ కదం తొక్కింది!కేటీఆర్ సహా పలువురు నేతలకు గాయాలు.. ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల తీవ్ర ఆగ్రహం
భారీ బైక్ ర్యాలీతో కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లిన నాయకులు
ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలంటూ కలెక్టర్కు వినతిపత్రం
పున్నమి ప్రతినిధి: అబ్దుల్ సాదిక్, నిర్మల్:
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మహిళా మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితర నాయకులతో జరిగిన ఘటనలు, ఎమ్మెల్యేల అరెస్టులను నిరసిస్తూ నిర్మల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఘటనలో కేటీఆర్ ముఖం, చేతికి గాయాలయ్యాయని, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాలికి గాయమైనట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. సునీత లక్ష్మారెడ్డిని చూసి కేటీఆర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు షర్టు చినిగిన ఘటనపైనా బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
బైక్ ర్యాలీతో నిరసన.. కలెక్టర్కు వినతిపత్రం
ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసనగా నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అరెస్టు చేసిన ప్రజాప్రతినిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజా ఉద్యమాలను అణచివేయొద్దు
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులు, ప్రజాప్రతినిధులపై నిర్బంధాలు, అరెస్టులు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి కే. సుశీల్ కుమార్ రావు, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, బీఆర్ఎస్వీ నాయకులు బి. సాయికుమార్, నిర్మల్ జిల్లా సీనియర్ నాయకులు ఎండి. మైబూబ్, జిల్లా యువజన విభాగం నాయకులు జుబేర్, టౌన్ సెక్రటరీలు నయీమ్, మసూద్, టౌన్ మైనార్టీ సెక్రటరీ ఎండి. అజీజ్, పార్టీ సీనియర్ కార్యకర్త భీమేష్, వైఎస్సార్ కాలనీ కౌన్సిలర్ అభ్యర్థి మినార్ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


