మణుగూరు / ఖమ్మం
మణుగూరు: పట్టణంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మణుగూరు నేతాజీ గ్రౌండ్‌లో ఈ నెల 27న జరిగిన శివ హత్య కేసులో మొత్తం 27 మంది నిందితులను గుర్తించినట్లు మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం ఖమ్మం సబ్‌జైలుకు తరలించినట్లు తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
మృతుడు శివకు, ఎం.కే గ్యాంగ్ గ్రూప్ సభ్యులకు మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలే హత్యకు ప్రధాన కారణమని డీఎస్పీ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా మణుగూరుకు వచ్చిన శివను మాట్లాడుకుందామని నేతాజీ గ్రౌండ్‌కు పిలిపించి, అక్కడ విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులంతా మణుగూరుకు చెందినవారేనని, కేవలం పార్టీల పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని తెలిపారు. నిందితులు గంజాయి వంటి మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.



